ప్రధాని నరేంద్రమోదీకి వివిధ సందర్భాల్లో వచ్చిన బహుమతులు, జ్ఞాపికలను వేలం వేయాలని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. పారాలింపిక్స్ విజేతలు ఇచ్చిన స్పోర్ట్స్ షూ తో పాటు వెండి వీణ, రామమందిరం ప్రతిమ వంటి 600 రకాల వస్తువులను వేలం వేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. వేలం వేస్తున్న బహుమతుల్లో రూ.600ల నుంచి రూ.8.26 లక్షల విలువ చేసేవి ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.1.5 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు.
మోదీ పుట్టిన రోజైన (సెప్టెంబర్ 17) నేటి నుంచి అక్టోబర్ 2వరకు ఈ వేలం కొనసాగుతుంది కేంద్రమంత్రి షెకావత్ తెలిపారు. వేలం వేసే వస్తువుల ప్రదర్శన శాలను ఆయన సందర్శించారు. తనకు లభించే అన్ని బహుమతులను వేలం వేసే కొత్త సంస్కృతిని ప్రధాని మోదీ ప్రారంభించారని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఇలానే చేసేవారని తెలిపారు.
వేలం నిర్వహించడం ఇది ఆరోసారని వెల్లడించారు. బహుమతుల వేలం ద్వారా వచ్చే నగదును గంగానది ప్రక్షాళనకు గానూ ‘జాతీయ గంగానిధి’కి విరాళంగా అందజేస్తానని గతంలో మోదీ తెలిపారు.