ఆర్జి కర్ డాక్టర్ హత్యాచారం తరవాత నెల రోజులుగా వైద్యులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. నిరసన తెలుపుతోన్న డాక్టర్లతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం నేరుగా చర్చలు జరిపారు. డాక్టర్ల డిమాండ్ మేరకు కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను బదిలీ చేశారు. ఇక ఆరోగ్య శాఖ డైరెక్టర్, వైద్య విద్య డైరెక్టర్లను తొలగించేందుకు సీఎం అంగీకరించారు. డాక్టర్లు మొత్తం ఐదు డిమాండ్లు ఉంచగా, మూడు డిమాండ్లు వెంటనే పరిష్కరించారు. మరో రెండు డిమాండ్లు పరిష్కరించాల్సి ఉంది. చర్చలు సఫలమైనట్లు సీఎం ప్రకటించారు. అయితే నెల రోజులుగా చేస్తోన్న సమ్మె విరమిస్తున్నట్లు డాక్టర్లు ప్రకటించలేదు.
డాక్టర్ల డిమాండ్ల పరిష్కారానికి కోల్‌కతా కాళీఘాట్ సమీపంలోని సీఎం మమతా బెనర్జీ నివాసంలో సాయంత్రం చర్చలు జరిగాయి. చర్చలు సానుకూలంగా ముగిశాయి. సమ్మె విరమించి విధుల్లో చేరాలని సీఎం మమతా బెనర్జీ కోరారు. దీనిపై డాక్టర్లు ప్రకటన చేయాల్సి ఉంది.