ఆమె ఆలాపనతో విష్ణుమూర్తి వేయి వీనులవిందు చేసుకుంటాడు. ఆమె గాత్రపు సుప్రభాతంతో వేంకటేశుడు పవళింపు పూర్తి చేసుకుంటాడు. ఆమె స్వరసంకల్పంతో హిమవన్నగ సానువులపై పరమశివుడు ఆనందతాండవం చేస్తాడు. భారత సంగీత స్వర శిఖరం, ఆసేతుశీతాచల స్వరగంగా ప్రవాహం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి.
‘‘నేను ప్రధానమంత్రిని మాత్రమే. ఆమె సంగీత సామ్రాజ్యానికి మహారాణి’’ అని భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవాహర్‌లాల్ నెహ్రూ జోతలర్పించిన అపురూప ప్రతిభ ఎమ్మెస్ సుబ్బులక్ష్మి సొంతం. ఐక్యరాజ్యసమితిలో ప్రదర్శన ఇచ్చిన మొదటి భారతీయురాలు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి. రామన్ మెగసెసే పురస్కారం అందుకున్న మొదటి భారతీయ సంగీత విదుషి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి. భారతరత్న పురస్కారం మొదటిసారి వరించిన సంగీత విద్వాంసురాలు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి.
మదురై షణ్ముగవదివు సుబ్బులక్ష్మి 1916 సెప్టెంబర్ 16న మద్రాస్ ప్రెసిడెన్సీలోని మదురై నగరంలో జన్మించారు. ఆమె తల్లి షణ్ముగవదివు, తండ్రి సుబ్రమణ్య అయ్యర్. సుబ్బులక్ష్మి అమ్మమ్మ వయొలిన్ విద్వాంసురాలు, తల్లిదండ్రులు వైణికులు. సుబ్బులక్ష్మి బాల్యం నుంచే సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టింది. సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వద్ద కర్ణాట సంగీతం, పండిత్ నారాయణరావు వ్యాస్ వద్ద హిందుస్తానీ సంగీతంలో శిక్షణ పొందింది.
ఎమ్మెస్ తన పదకొండేళ్ళ వయసులో 1927లో తిరుచిరాపల్లిలోని రాక్‌ఫోర్ట్ టెంపుల్‌లో వంద స్తంభాల హాలులో మొదటి బహిరంగ ప్రదర్శన ఇచ్చింది. పదమూడేళ్ళ వయసులో మద్రాస్ మ్యూజిక్ అకాడెమీలో మొదటిసారి ప్రదర్శన ఇచ్చింది. అప్పటినుంచీ ఆమె సంగీత స్వరయాత్ర అప్రతిహతంగా సాగిపోయింది. 1936లో చెన్నై వెళ్ళిన ఎమ్మెస్ చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 1938లో విడుదలైన సేవాసదన్ చలనచిత్రంలో ఆమె నటించింది.
భారతదేశపు సాంస్కృతిక రాయబారిగా ఎమ్మెస్ సుబ్బులక్ష్మి లండన్, న్యూయార్క్, కెనడా, తదితర దేశాల్లో కచేరీలు చేసారు. ఐక్యరాజ్యసమితిలో ప్రదర్శన ఇచ్చిన మొదటి భారతీయ సంగీత విద్వాంసురాలు సుబ్బులక్ష్మే. తన భర్త కల్కి సదాశివం మరణించిన తర్వాత 1997 నుంచి సుబ్బులక్ష్మి కచేరీలు చేయడం మానివేసింది. 2004 డిసెంబర్ 11న ఆమె చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచింది.
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి సంగీత స్వరసముద్రంలో ఓలలాడని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆమెను భారత సంగీత ప్రపంచం అమితంగా ప్రేమించింది. లతా మంగేష్కర్ ఆమెను తపస్విని అని సంబోధించేవారు. ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ సుస్వరలక్ష్మి అని పిలిచేవారు. కిషోరీ అమోన్‌కర్ ఎమ్మెస్‌ను ఆఠ్‌వా సుర్ (ఎనిమిదవ స్వరం) అని కీర్తించారు.
ఎమ్మెస్‌ను ఎన్నో అవార్డులు, పురస్కారాలు వరించాయి. 1954లో పద్మభూషణ్, 1956లో సంగీత నాటక అకాడెమీ అవార్డు, 1968లో సంగీత కళానిధి పురస్కారం, 1974లో రామన్ మెగసెసే అవార్డు, 1975లో పద్మవిభూషణ్, సంగీతకళా శిఖామణి, 1988లో కాళిదాస్ సమ్మాన్ పురస్కారం, 1990లో ఇందిరాగాంధీ జాతీయ సమగ్రత అవార్డు, 1998లో భారతరత్న పురస్కారాలు సుబ్బులక్ష్మిని వరించి తమ విలువ పెంచుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆమెను ఆస్థాన విద్వాంసురాలిగా సత్కరించింది. 2005 డిసెంబర్ 18న భారత ప్రభుత్వం సుబ్బులక్ష్మి స్మారక తపాలాబిళ్ళను విడుదల చేసింది.