కర్ణాటక నాగమంగళలో గణపతి నవరాత్రుల తర్వాత వినాయక నిమజ్జనం సమయంలో చెలరేగిన హింసాకాండ వెనుక కేరళకు చెందిన నిషిద్ధ ఇస్లామిక్ సంస్థ పిఎఫ్ఐ హస్తమున్నట్లు తెలుస్తోంది. నాగమంగళలో హింసాకాండ కర్ణాటక రాష్ట్రంలో రాజకీయంగానూ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ సంఘటన ఉద్దేశపూర్వకంగా కొందరు రెచ్చగొట్టి చేయించినదని, కేరళకు చెందిన కొందరు వ్యక్తుల ప్రమేయం ఉందనీ బిజెపి, ఇతర హిందూ సంఘాలు ఆరోపించాయి.
నాగమంగళలో చెలరేగిన హింసాకాండకు సంబంధించి పోలీసులు 74మంది వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. వారిలో యూసుఫ్, నజీర్ అనే ఇద్దరు వ్యక్తులున్నారు. వారు కేరళలోని మలప్పురం ప్రాంతానికి చెందిన వారు. వారిద్దరికీ నిషిద్ధ ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా – పిఎఫ్ఐతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలున్నాయి. దాన్నిబట్టే, నాగమంగళలో జరిగిన హింసాకాండ బైటనుంచి వెళ్ళిన వ్యక్తులు చేసిన కుట్ర అయి ఉంటుందన్న సందేహాలు తలెత్తాయి.
యూసుఫ్, నజీర్ ఇద్దరూ నాగమంగళ ప్రాంతంలో కొంతకాలంగా నివసిస్తున్నారని విశ్వహిందూ పరిషత్ నాగమంగళ తాలూకా అధ్యక్షుడు అజిత్ ప్రసాద్ వెల్లడించారు. వాళ్ళిద్దరికీ పిఎఫ్ఐతో సంబంధాలున్నాయని, ముందస్తు ప్రణాళిక ప్రకారం నాగమంగళలో మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికే అక్కడికి వారు వచ్చారనీ ఆయన ఆరోపిస్తున్నారు. హింసాకాండ జరిగిన రోజు నాగమంగళలోని ఒక మెడికల్ షాప్ నుంచి 200 మాస్కులు కొనుగోలు చేసారు. దాన్నిబట్టే హింసాకాండ వ్యవస్థీకృతంగా జరిగిందన్న సందేహాలు బలపడుతున్నాయి. నాగమంగళలో హింసాకాండ జరిగినప్పుడు కేరళకు చెందిన ముస్లిములు పెట్రోలు బాంబులతో దాడులు చేసారని అజిత్ ప్రసాద్ ఆరోపించారు. అందుకే ఆ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎకు అప్పగించాలని డిమాండ్ చేసారు.
ఈ ఆరోపణలను, పిఎఫ్ఐ ప్రమేయంపై ఊహాగానాలనూ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టిపడేసింది. జరిగిన ఘర్షణలకు, పిఎఫ్ఐకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు నిరూపించగల బలమైన సాక్ష్యాలేమీ లేవని మంత్రి చలువరాయస్వామి ప్రకటించారు. ఘర్షణల సమయంలో కేరళ నుంచి ఎవరూ రాలేదు, ఇక్కడినుంచి ఎవరూ వెళ్ళలేదు. అయితే కేరళ నుంచి వచ్చిన ఒక వ్యక్తి నాగమంగళలో ఒక బేకరీలో పనిచేస్తున్నాడు. ఈ హింసాకాండలో అతని ప్రమేయం ఉండవచ్చని అతన్ని అరెస్ట్ చేసారు’’ అని చలువరాయస్వామి చెప్పారు. సమగ్ర దర్యాప్తు జరిగితే తప్ప ఆ హింసాకాండ వెనుక ఏదైనా ఒక సంస్థ ప్రమేయం ఉందని చెప్పలేమన్నారు.
హింసాకాండ ఎలా మొదలైందన్న దాని గురించి కొన్ని ఇబ్బందికరమైన విషయాలు వెలుగు చూసాయి. స్థానిక పోలీసులు ఆరోజు పరిస్థితిని సరిగ్గా హ్యాండిల్ చేయలేదని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నాగమంగళ ఇనస్పెక్టర్ అశోక్ కుమార్, నిమజ్జనం రోజు ఊరేగింపులో భద్రతా విధుల కోసం వచ్చిన పోలీస్ రిజర్వ్ దళానికి ఆహారం ఏర్పాటు చేయలేదు. 24 డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్‌కు చెందిన పోలీసులను భోజనం కోసం బైటకు పంపించారు. వాళ్ళు బైటకు వెళ్ళిన అరగంట తర్వాత హింసాకాండ చెలరేగింది. ఆ సమయంలో కేవలం ఏడుగురు పోలీసులు మాత్రమే విధుల్లో ఉన్నందున వారు ఏమీ చేయలేకపోయారు.
అల్లరిమూకలు రాళ్ళు, కర్రలు, కత్తులు, పెట్రోలు బాంబులు తదితర మారణాయుధాలతో హింసాకాండకు పాల్పడ్డాయి. దాంతో గణనీయమైన స్థాయిలో విధ్వంసం జరిగింది. ఎన్నో దుకాణాలను తగులబెట్టేసారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న కొద్దిమంది పోలీసులూ గాయాల పాలయ్యారు. రిజర్వ్ పోలీసులు వెనక్కి తిరిగి వచ్చే సమయానికి పరిస్థితి అదుపుతప్పిపోయింది. ఆ సంఘటనకు సంబంధించి హోంశాఖ పోలీస్ ఇనస్పెక్టర్ అశోక్ కుమార్‌ను సస్పెండ్ చేసింది.
నాగమంగళ హింసాకాండ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలుగజేసింది. రాష్ట్రంలో మతసామరస్యం, శాంతిభద్రతల పరిస్థితి గురించి భయాందోళనలు వ్యాపించాయి, రాష్ట్రప్రభుత్వం, స్థానిక అధికారులూ ఈ పరిస్థితి నుంచి బైటపడేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా, దర్యాప్తులో కొత్త విషయాలు బైటపడే కొద్దీ వ్యవస్థల జవాబుదారీతనం గురించిన ప్రశ్నలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.