ఉత్తరప్రదేశ్లోని బరేలీలో మిలాదున్నబీ సందర్భంగా ముస్లిములు, హిందువుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది హిందువుల కావడ్ యాత్ర మీద ముస్లిములు దాడి చేసిన ప్రదేశం మీదుగానే ఇవాళ ముస్లిములు యాత్ర చేయడానికి ప్రయత్నించారు. గతరాత్రి ముస్లిములు బారావఫాత్ ఊరేగింపు చేపట్టడంతో పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
మిలాదున్నబీ సందర్భంగా చేసే ఊరేగింపు మార్గం విసయంలో వివాదం తలెత్తింది. ముస్లిములు తమ మతానికి చెందిన నినాదాలు చేస్తూ ఊరేగింపు మొదలుపెట్టడంతో హిందువులు రహదారుల మీదకు వచ్చారు. ఆ మార్గంలో ఊరేగింపు చేయవద్దంటూ నినాదాలు చేసారు. కొన్ని గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. పోలీసులు వచ్చిన తర్వాతే పరిస్థితి సద్దుమణిగింది.
ప్రతీయేటా శ్రావణ మాసంలో ఆ మార్గంలో హిందువుల కావడ్ యాత్ర జరిగేది. ఈ యేడాది ఆ యాత్రను నిలువరించారు. హిందువులకు పవిత్రమైన కావడ్ యాత్రను అడ్డుకున్నందున, ఆ మార్గంలో ముస్లిములను ఊరేగింపు జరుపుకోనీయబోమని హిందువులు పట్టుపట్టారు. ముస్లిములు మాత్రం, ప్రతీయేడాదీ తమ ఊరేగింపు ఆ దారిలోనే వెడుతోందని, ఈ యేడాది తాము వెనక్కి తగ్గేదే లేదనీ తేల్చేసారు. దాంతో ఇరుపక్షాల మధ్యా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి 8గంటలకు ఊరేగింపు మొదలైంది. అయితే హిందువులు ఊరేగింపును ఆ దారిలో నుంచి వెళ్ళనీయబోమని అడ్డుకోవడంతో దాదాపు అర్ధరాత్రి వరకూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి.
ముస్లిములు కొత్త పద్ధతులు మొదలు పెడుతున్నారనీ, తమ కావడ్ యాత్రను అడ్డుకున్న మార్గంలో బారావఫాత్ ఊరేగింపు ఎలా చేస్తారనీ హిందువులు ప్రశ్నించారు. ఒకవేళ ఊరేగింపును అక్కడే కొనసాగిస్తే తామందరం ఆ ప్రాంతం నుంచి వలసపోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు.
విషయం తెలిసి పోలీసులు రంగప్రవేశం చేసారు. ఎంతో కష్టపడి ఇరువర్గాలనూ శాంతింపజేసారు. ఆ సంఘటన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగకూడదనే ఉద్దేశంతో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసారు.
బారావఫాత్ను సాధారణంగా మిలాద్-ఉన్-నబీ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిములందరూ చేసుకునే పండుగ అది. ఇస్లాం మతాన్ని స్థాపించిన మొహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఈ పండుగ జరుపుకుంటారు.