ఇవాళ సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించబోయే దుర్గ్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్లో ఉండగా దానిమీద రాళ్ళదాడి చేసిన ఘటనలో రైల్వే పోలీస్ ఫోర్స్ ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. వారిలో ఒక కాంగ్రెస్ నాయకుడి బంధువు కూడా ఉన్నాడు.
ఈ రాళ్ళదాడి ఘటన శుక్రవారం సాయంత్రం ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో చోటు చేసుకుంది. ట్రయల్ రన్లో భాగంగా విశాఖపట్నం నుంచి దుర్గ్ వెడుతున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్, బాగ్బహారా ప్రాంతానికి చేరుకున్నప్పుడు నిందితులు రైలు మీదకు రాళ్ళు రువ్వారు. దాంతో మూడు బోగీల కిటికీ తలుపులు ధ్వంసమయ్యాయి.
వెంటనే స్పందించిన ఆర్పిఎఫ్ సిబ్బంది, రాళ్ళ దాడికి పాల్పడిన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రైల్వే పోలీస్ చట్టం సెక్షన్ 153 కింద వారిపై కేసు నమోదు చేసారు. వారిని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి సెప్టెంబర్ 17 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
నిందితులను దేవేంద్ర చంద్రాకర్, జీతూ తాండీ, అర్జున్ యాదవ్, లేఖరాజ్ సోన్వానీ, శివకుమార్ బఘేల్గా గుర్తించారు. వారిలో శివకుమార్ బఘేల్, ఛత్తీస్‌గఢ్‌లోని ఖల్లారీ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడి సోదరుడు. అతని కుటుంబంలో మరోవ్యక్తి కాంగ్రెస్‌కు చెందిన వార్డుసభ్యుడు కూడా.
దుర్గ్-విశాఖపట్నం వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ సాయంత్రం వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభిస్తారు. దుర్గ్ నుంచి విశాఖపట్నం మొత్తం 565 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు 8 గంటల్లో ప్రయాణిస్తుంది. రెండు నగరాల మధ్యా మూడుగంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
గత కొద్దికాలంగా వందేభారత్ రైళ్ళ మీద రాళ్ళు రువ్వే ఘటనలు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంలో దేశీయ రైల్వే ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతున్నాయి. దాన్ని సహించలేని ప్రతీపశక్తులు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఒకే తరహాలో జరుగుతున్న దాడులను చూస్తే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైల్వే ప్రాజెక్టుకు అవాంతరాలు కలిగించే దురుద్దేశంతోనే వ్యూహాత్మకంగా దాడులు చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.