భారతదేశం నుంచి అంటరానితనాన్ని పూర్తిగా నిర్మూలించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో ఆదివారం జరిగిన ఆర్ఎస్ఎస్ సమావేశంలో భాగవత్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ‘‘అస్పృశ్యతను పూర్తిగా తొలగించాలి. అంటరానితనాన్ని నిర్మూలించడం సమాజపు ఆలోచనా ధోరణిని మార్చడం ద్వారానే సాధ్యం. ఆ మార్పు సాధించడానికి సామాజిక సమరసత కీలకం’’ అని భాగవత్ చెప్పారు.
స్వయంసేవకులు ఐదు ప్రధాన అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని భాగవత్ పిలుపునిచ్చారు. సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ ప్రబోధనం, స్వీయజ్ఞానం, పౌర క్రమశిక్షణ అనే ఐదు అంశాల పట్ల శ్రద్ధ వహించాలని, వాటిని స్వయంసేవకులు తమ దైనందిన జీవితంలో పాటిస్తే, సమాజం అనుసరిస్తుందనీ చెప్పుకొచ్చారు.
వచ్చే యేడాది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతజయంతి సంవత్సరం సందర్భంగా దేశానికి స్వయంసేవకులు చేయాల్సిన సేవ ఎంతో ఉందని భాగవత్ గుర్తుచేసారు. వారు చేసే పని వెనుక ఉన్న ఆలోచనను పూర్తిగా అర్ధం చేసుకోవాలనీ, తమ విధులు నిర్వహిస్తున్నప్పుడు సంఘ నియమాలను మనసులో పెట్టుకోవాలనీ సూచించారు. దేశాన్ని బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని భాగవత్ పిలుపునిచ్చారు.
‘‘భారత్ ఒక హిందూ దేశమని మా ప్రార్థనలో చెబుతాం, ఈ దేశానికి జీవగర్ర హిందూ సమాజమే. ఈ దేశంలో ఏదైనా మంచి జరిగితే హిందూ సమాజపు కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఏదైనా తప్పుగా జరిగితే హిందూ సమాజమే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈ దేశమనే మహానౌకకు చుక్కాని హిందూ సమాజమే’’ అన్నారు. ఈ దేశాన్ని పరిపుష్టంగానూ, సమృద్ధంగానూ తయారుచేయడానికి కఠోర పరిశ్రమ, సామూహిక కృషీ అవసరమని గుర్తుచేసారు. హిందూయిజం అని ఇవాళ మనం పిలుస్తున్నది నిజానికి ప్రపంచ మానవత్వమనే మతం, అది అందరి సంక్షేమాన్నీ కోరుతుంది అని భాగవత్ వివరించారు.
‘‘ఈ ప్రపంచంలోఅత్యంత ఉదారవాదులు హిందువులే. తమకు ఏది ఇచ్చినా స్వీకరిస్తారు. అందరిపట్లా సమభావన కలిగి ఉంటారు. తమ తెలివిని విభేదాలను కాక విజ్ఞానాన్ని పంచడానికి, తమ సంపదను ఖర్చులకు కాక విరాళాలకు, తమ బలాన్ని బలహీనుల రక్షణకూ ఉపయోగించిన ధైర్యవంతులైన పూర్వీకుల వారసత్వం హిందువులది. పూజావిధానాలు, భాషలు, కులాలు, ప్రాంతాలు, ఆచార వ్యవహారాలు వేర్వేరు అయినప్పటికీ హిందువైన వాడి గుణం, సంస్కృతి అదే. ఆ విలువలను కలిగి ఉండి ఆ సంస్కృతిని పాటించే ఎవరైనా హిందువే’’ అని ఆయన స్పష్టం చేసారు.
హిందూ సంప్రదాయం ప్రతీ పదార్ధంలోనూ చైతన్యాన్ని చూస్తుందని, అందుకే ప్రతీ హిందువూ పర్యావరణ పరిరక్షణ బాధ్యతను తీసుకోవాలని భాగవత్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని వివరించారు.
‘‘చిన్నచిన్న పనులతో మొదలుపెట్టండి. నీటిని ఆదా చేయండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేయండి, మొక్కలు నాటి పెంచండి, ప్రతీ ఇంటినీ తోటలు, పచ్చదనంతో హరితగృహాలుగా మార్చండి. వ్యక్తులుగానూ, సమాజంగానూ ఇలాంటి పనులతో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు మొదలుపెట్టండి’’ అని ఆయన చెప్పారు.
భారతదేశంలో కుటుంబ జీవన విలువల పతనం గురించి భాగవత్ ఆందోళన వ్యక్తం చేసారు. కొత్త తరాలు మన ఆచార సంప్రదాయాలను చాలా వేగంగా మరచిపోతున్నాయని ఆవేదన చెందారు. కుటుంబంలోని సభ్యులందరూ వారానికి ఒక్కసారయినా కలసి కూర్చుని ప్రార్థన చేయాలి, కలసి భోజనం చేయాలి, సమాజానికి ఎలా సేవ చేయాలో చర్చించాలి అని కుటుంబాలకు ఆయన సూచన చేసారు.
ఇంకా భాగవత్ స్వయంసమృద్ధి, పొదుపరితనాల ప్రాధాన్యతను వివరించారు. దేశీయంగా చేసిన వస్తువులను మాత్రమే కొనాలని, విదేశీ వస్తువులను అత్యవసరమైతే మాత్రమే కొనాలనీ సూచించారు. ‘‘దైనందిన జీవితంలో పొదుపుగా ఉండడం చాలా అవసరం. సమాజసేవకు మన జీవితంలో కొంత సమయాన్ని కేటాయించాలి. సమాజ సేవ అనేది దాతృత్వం కాదు, మన విధి అని భావించాలి’’ అని మోహన్ భాగవత్ చెప్పుకొచ్చారు. భారతదేశంలో పౌర క్రమశిక్షణ ప్రాధాన్యతను ఆయన బలంగా చాటారు. ఈ దేశ పౌరులుగా ప్రతీ ఒక్కరూ తమతమ బాధ్యతలేమిటో తెలుసుకుని మసలుకోవాలని పిలుపునిచ్చారు.
చివరిగా ఆయన ఆల్వార్‌లోని మాతృస్మృతివనాన్ని సందర్శించి, అక్కడ మొక్కలు నాటారు.