లిక్కర్ పాలసీ కేసులో బెయిల్‌పై విడుదలైన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రెండురోజుల్లో రాజీనామా చేస్తానని ప్రకటించారు. అనంతరం కొత్త వ్యక్తిని సీఎంగా ఎన్నుకుంటామని ప్రకటించారు. ఈ పరిణామం స్పందించిన బీజేపీ, కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనను ఎన్నికల ప్రచార ఆర్భాటంగా అభివర్ణించింది. కేవలం పీఆర్ స్టంట్ అంటూ దుయ్యబట్టింది. కోర్టు విధించిన షరతుల కారణంగానే రాజీనామాకు సిద్ధపడ్డారని విమర్శించిన బీజేపీ నేతలు, దానిని రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్నారని ఆరోపించారు.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి మాట్లాడుతూ,ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి పార్టీగా మారిపోయిందని, పీఆర్ స్టంట్‌తో మళ్లీ ఇమేజ్‌ను పెంచుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. మన్మోహన్ సింగ్‌ను డమ్మీ ప్రధానిని చేసి తెరవెనుక ప్రభుత్వాన్ని నడిపిన సోనియా మోడల్ నే అమలు చేయాలనుకుంటున్నట్లు తేటతెల్లమైందన్నారు.
దాదాపు ఆరు నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్, దిల్లీలోని ఆప్ ఆఫీసులో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తాను రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానన్నారు. లిక్కర్ కేసులో నిర్దోషిగా తేలేవరకు ముఖ్యమంత్రి పదవిలో ఉండనని తెలిపారు.