టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు విచారణను ఏపీ పోలీసు శాఖ ముమ్మరం చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అరెస్టైన మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ ను రెండు రోజుల కస్టడీకి పోలీసులు తీసుకున్నారు. జ్యూడీషియల్ రిమాండ్ లో భాగంగా ఇప్పటి వరకు గుంటూరు జిల్లా జైలులో ఉన్న సురేశ్ ను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.
జైలు నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి విచారిస్తున్నారు. ఈనెల 17న మధ్యాహ్నం ఒంటిగంటకు మళ్ళీ గుంటూరు జిల్లా జైలుకు తరలించనున్నారు.
వైసీపీ హయాంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై కొందరు దాడికి పాల్పడ్డారు. వైసీపీ నేతలు ప్రోద్బలంతోనే దాడి జరిగిందని టీడీపీ ఆఫీసు సిబ్బంది, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ప్రస్తుతం విచారణ జరుగుతోంది. వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, లేళ్ళ అప్పిరెడ్డి కి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన కేసులోనూ నందిగం సురేశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులోనూ ఆయన అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.