ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండో రోజుల్లో తాను సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. మద్యం కేసులో క్లీన్ చిట్ వచ్చే వరకు సీఎం పదవిలో ఉండనని చెప్పారు. జైల్లో నుంచి ఎందుకు పరిపాలించకూడదని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించినట్లు గుర్తుచేశారు. తనను జైల్లో పెట్టి ఆప్‌ను చీల్చాలని బీజేపీ చేసిన ప్రయత్నం ఫలించలేదన్నారు. తమ పార్టీకి చెందిన సత్యేందర్ జైన్, అమానతుల్లా ఖాన్ ఇంకా జైల్లోనే మగ్గుతున్నారని కేజ్రీవాల్ చెప్పారు. రెండు, మూడు రోజుల్లో కొత్త వ్యక్తిని ఢిల్లీ సీఎంగా ఎన్నుకుంటామన్నారు.
భగవంతుడి ఆశీసుల వల్లే జైలు నుంచి బయటపడగలిగినట్లు చెప్పారు. బీజేపీయేతర సీఎంలపై కేసులు పెట్టి ప్రభుత్వాలను కూల్చి వేయాలని బీజేపీ నేతలు చూస్తున్నారని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం విజయన్, కర్ణాటక సీఎం సిద్దరామయ్యలపై పలు కేసులు పెట్టారని, కేసులు పెట్టినంత మాత్రాన రాజీనామా చేయాల్సిన పనిలేదన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాలనే ఉద్దేశంతోనే తనను జైల్లో పెట్టి ఆరు నెలలు వేధించినా పదవికి రాజీనామా చేయలేదన్నారు.
ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది, మహారాష్ట్రతోపాటు వచ్చే నవంబరులో ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ ఎన్నికల సంఘాన్ని కోరారు. తాను తప్పు చేయలేదని ప్రజలు భావిస్తే తనను గెలిపించాలని పిలుపు నిచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తాన్నన్నారు. ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.