ముగ్గురు ముష్కరులు హతం
కిశ్త్వాద్, ఉధంపుర్, పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో ముమ్మరంగా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల దుశ్చర్యలను భద్రతా బలగాలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. జమ్మూకశ్మీర్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల కదలికలు పెరిగాయి. దీంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగి ముష్కరుల ఆట కట్టిస్తున్నాయి.
గడిచిన 24 గంటల వ్యవధిలో మూడుమార్లు ఎదురుకాల్పులు జరిగాయి. బారాముల్లాలో ముగ్గురు ముష్కరులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ తెల్లవారుజామున ఫూంచ్ జిల్లాలో ఓ ఉగ్రవాద గ్రూపునకు చెందిన టాప్ కమాండర్, ఇద్దరు టెర్రరిస్టులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి.వీరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మెందహార్లోని పథనాతీర్ వద్ద భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరుపుతున్నాయి.
గడిచిన 42 ఏళ్లలో భారత ప్రధాని జమ్మూకశ్మీర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లడం ఇదే తొలిసారి. ఉగ్రమూకల ఆటకట్టించడమే లక్ష్యంగా భద్రతా బలగాలు పకడ్బందీ చర్యలు చేపట్టాయి. కిశ్త్వాద్, ఉధంపుర్, పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను మరింత పెంచాయి.