కేంద్ర నిర్ణయంతో సాగురైతులకు భారీగా లబ్ధి
నూనెగింజల సాగు రైతులకు మేలు జరిగేలా కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ చొరవతో ఆయిల పామ్ గెలలకు ఇకపై అధిక ధర లభించనుంది. ఇతర నూనెగింజలు సాగు చేస్తున్న రైతుల కష్టాలు తీరనున్నాయి.
పామ్ ఆయిల్ దిగుమతులపై సుంకాన్ని కేంద్రప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు విదేశాల నుంచి దేశంలోకి దిగుమతి అయ్యే పామ్ ఆయిల్‌పై దిగుమతి సుంకం 5.5శాతంగా ఉండగా కేంద్రం దానిని
27.5శాతానికి పెంచింది. రిఫైన్డ్ పామాయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై సుంకాన్ని 13.75 శాతం నుంచి 35.75శాతానికి పెంచింది.
దిగుమతి సుంకం 5.5శాతంగా ఉండడంతో ఇప్పటి వరకు విదేశాలపైనే ఎక్కువ ఆధారపడ్డారు. ప్రస్తుతం సుంకం పెంచడంతో దేశీయంగా పండే పంటకు గిరాకీ లభించనుంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పండించిన పామ్ ఆయిల్ గెలలు టన్ను ధర రూ.12,000 నుంచి రూ.13వేల మధ్యనే పలుకుతోంది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో అయిల్ పామ్ గెలల ధర టన్నుకు ఇకపై రూ.15వేల నుంచి రూ.17వేల దాకా పెరిగే అవకాశం ఉంది. పామాయిల్ ధర కనీసం టన్నుకు రూ.1లక్ష వరకు ఉండనుంది.
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమమైన నేషనల్ మిషన్ ఆన్‌ఎడిబుల్ ఆయిల్స్- ఆయిల్ పామ్ ద్వారా దేశంలో నూనెగింజల సాగుపథకం అమలవుతోంది.
వంటనూనెల దిగుమతిపైక భారత్ ఎక్కువగా విదేశాలపై ఆధారపడుతోంది. ఏటా దేశీయంగా వినియోగించే వంటనూనెల్లో 70 శాతం కంటే ఎక్కువ ఇతర దేశాల నుంచే కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నారు. అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయాఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతోంది.