ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన ఆలయాలు, పర్యాటకరంగంపై సైబర్ నేరగాళ్ళ కన్నుపడింది. ఆఖరికి శ్రీశైల మల్లన్న ఆలయం పేరిట ఫేక్ వైబ్ సైట్ సృష్టించి భక్తులను మోసగిస్తున్నారు.
ఆన్లైన్లో వసతి కోసం వెతికేవారే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. అచ్చం శ్రీశైలం దేవస్థానం అధికారక వెబ్‌సైట్‌ను పోలి ఉండే ఫేక్ వెబ్సైట్ సృష్టించి, అందులో వివరాలు నింపిన వెంటనే కాల్ చేస్తున్నారు. వసతి గది బుక్ చేశామని అందుకు సంబంధించిన రుసం చెల్లించాలని కోరుతున్నారు.
ఫోన్ పే, గూగుల్ పే ఇతర యూపీఐ పేమెంట్ ఆప్షన్లతో డబ్బు చెల్లించాలని కోరుతున్నారు. పేమెంట్ తర్వాత ఫేక్ బుకింగ్ నంబర్లు పంపి మోసం చేస్తున్నారు. వసతి గదుల కోసం దేవస్థానం కానీ, ప్రైవేట్ సత్రాల సిబ్బంది, ఏపీ టూరిజం వారు కానీ పేమెంట్ కోసం ఫోన్ చేయరు.
ఆలయంలో రోజూ జరిగే ఆర్జితసేవ టికెట్లు, వసతి గదుల విషయంలో దళారులు అధికమయ్యారు. దీంతో టికెట్లను వందశాతం ఆన్లైన్ చేసింది. ఇదే అవకాశంగా సైబర్ కేటుగాళ్ళు రెచ్చిపొతున్నారు.
ఏపీ టూరిజం, ప్రైవేట్ సత్రాలకు ఈ ఫేక్ బెడద తప్పడం లేదు. సైబర్‌క్రైం పోలీసులు ఈ ఫిర్యాదులపై విచారణ జరపగా రాజస్థాన్‌లోని జైపూర్ కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది.
www.srisailadevasthanam.org మాత్రమే అధికారక వెబై సైట్ అని అధికారులు స్పష్టం చేశారు. శ్రీశైల దేవస్థాన వెబ్సైట్లను పోలిన నకిలీ వెబ్సైట్ల విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.