జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ దోడాలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ సభలో ప్రతిపక్షాలను విమర్శించే క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ మీద విరుచుకుపడ్డారు. ‘మొహబ్బత్ కీ దూకాన్’ అనే రాహుల్ నినాదాన్ని మార్చి రాహుల్ గాంధీ మీదకే ఎక్కుపెట్టారు. ‘‘ద్వేషపు దుకాణాన్ని నడుపుతున్న వాళ్ళు ప్రేమ దుకాణం అనే బోర్డు వెనకాల దాక్కున్నారు’’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీల ఎన్నికల వాగ్దానాలు గనుక అమలు చేస్తే పాత జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో మళ్ళీ స్కూళ్ళ దహనాలు, రాళ్ళురువ్వడాలూ రోజువారీ వ్యవహారంగా మారిపోతాయని దుయ్యబట్టారు.
‘‘కాంగ్రెస్, పిడిపి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు 370వ అధికరణాన్ని పునరుద్ధరించాలి అంటున్నాయి. దానర్ధం పహాడీలకు చెందాల్సిన రిజర్వేషన్లను ఆ మూడు కుటుంబాలూ మళ్ళీ లాగేసుకోవాలని భావిస్తున్నాయి. ఆ పార్టీల మ్యానిఫెస్టోలే కనుక అమలైతే పాఠశాలలు మరోసారి తగులబడిపోతాయి, పిల్లల చేతుల్లోకి రాళ్ళు వస్తాయి, మళ్ళీ సమ్మెలు, కర్ఫ్యూలు వస్తాయి. వాళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడతారు. వాళ్ళు ద్వేషపు దుకాణం మీద ప్రేమ దుకాణం అని బోర్డు తగిలించుకుని తిరుగుతుంటారు’’ అని మోదీ అన్నారు.
ప్రతిపక్ష నాయకులు తమ తప్పులు కప్పిపుచ్చుకోడానికి రాజ్యాంగాన్ని జేబుల్లో పెట్టుకుని తిరుగుతున్నారని మోదీ అన్నారు. ‘‘వాళ్ళు రాజ్యాంగపు ఆత్మను అగౌరవపరిచారు. ఇక్కడ రెండు రాజ్యాంగాలు ఎందుకు? పహాడీలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఎందుకు ఇన్నాళ్ళూ రిజర్వేషన్లు లేవు? ఎన్నో తరాల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు జమ్మూకశ్మీర్‌కు రిజర్వేషన్లు ఇచ్చింది. ఇవాళ చాలామందికి మొదటిసారి ఓటుహక్కు లభించింది. భారత రాజ్యాంగం ప్రతీఒక్కరికీ ఓటుహక్కునిచ్చింది. కానీ రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకున్నవాళ్ళు మీలో కొందరికి ఓటుహక్కును 75ఏళ్ళపాటు లేకుండా చేసారు’’ అని మోదీ విమర్శించారు.
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేది బీజేపీ మాత్రమేనని మోదీ చెప్పారు. మీ హక్కుల పరిరక్షణకు తాను గ్యారంటీ ఇస్తున్నానని చెప్పారు.
జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికలు మొదటి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న జరుగుతుంది. ఆ దశలో దోడా, కిష్తవర్, రాంబాణ్ జిల్లాల్లోని 8 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు.