ఆధార్ కార్డులోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును కేంద్రప్రభుత్వం మరోసారి పెంచింది. గతంలో విధించిన సెప్టెంబర్ 14 వరకు గడువు నేటితో ముగియడంతో ఇప్పుడు ఆ గడువును 2024 డిసెంబర్ 14 వరకు పొడిగిస్తూ.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక ప్రకటన చేసింది.
ఆధార్ కార్డ్ ఫ్రీ అప్డేట్ ‘మై ఆధార్’ (myAdhaar) పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆఫ్‌లైన్‌లో అప్డేట్ చేసుకోవాలంటే రూ.50 చెల్లించాల్సి ఉంది. ఆన్లైన్ పోర్టల్ యూఐడీఏఐ వెబ్సైట్లో పేరు, అడ్రస్, ఫోటో, కేరాఫ్, డేట్ ఆఫ్ బర్త్, ఇతర మార్పులను డిసెంబర్ 14 వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.
ఈ గడువును కేంద్రం పలుమార్లు పొడిగించింది. 2023 డిసెంబర్ 15 నుంచి 2024 మార్చి 14, ఆ తరువాత జూన్ 14, సెప్టెంబర్ 14కు పొడిగిస్తూ.. ఇప్పుడు తాజాగా ఈ తేదీని 2024 డిసెంబర్ 14కు పొడిగించారు.
ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ ఎలా చేయాలంటే….?
https://myaadhaar.uidai.gov.in/ లో 16 అంకెల ఆధార్ నంబర్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి ‘లాగిన్ యూజింగ్ ఓటీపీ’పై క్లిక్ చేయాలి.
లింక్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే పోర్టల్‌ను యాక్సెస్ చేయగల్గుతారు.
అనంతరం ‘డాక్యుమెంట్ అప్డేట్’ ఎంచుకోవాలి. రెసిడెంట్ ప్రస్తుత వివరాలు కనిపిస్తాయి. అప్డేట్ చేయాలనుకుంటున్న డాక్యుమెంట్లను అంటే పేరు, చిరునామా, ఫోటో, ఇతర మార్పులను ఎంచుకోవాలి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ లేదా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్స్‌ను ఎంచుకోవాలి. అవసరమైన డాక్యుమెంటును అప్లోడ్ చేయాలి. తర్వాత ‘సబ్మిట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (యూఆర్ఎన్) జనరేట్ అవుతుంది.