జమ్ము కశ్మీర్‌లో అప్రకటిత కర్ఫ్యూలకు కాలం చెల్లిందని ప్రధాని మోదీ దోడాలో జరిగిన ఎన్నికల సభలో స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తరవాత చాలా కాలం జమ్ముకశ్మీర్ విదేశీ శక్తుల వలలో చిక్కుకుందని, తరవాత వారసత్వ రాజకీయాలకు బలైందన్నారు. గతలో జమ్ములో అడుగు పెట్టాలంటేనే కాంగ్రెస్ పార్టీకి చెందిన హోం మంత్రులు కూడా భయపడేవారని ప్రస్తుతం పరిస్థితి మారిందన్నారు. కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ దోడా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
జమ్ము కశ్మీర్‌లో 24 సంవత్సరాలుగా కనీసం పంచాయతీ ఎన్నికలు కూడా జరగలేదని, పదేళ్లుగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేదన్నారు. కొత్త నాయకత్వాన్ని మీ ముందుకు తేవాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు వచ్చినట్లు ప్రధాని మోదీ చెప్పారు. కేంద్రం జమ్మూ కశ్మీర్‌కు ప్రకటించిన అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రజలకు గుర్తుచేశారు. 42 సంవత్సరాల తరవాత దేశ ప్రధాని దోడాలో అడుగు పెట్టారు.
నాలుగు రోజుల్లో జమ్ము కశ్మీర్‌లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ మూడు రోజులుగా వరుస ఎన్‌కౌంటర్లు చోటుకున్నాయి. మూడు చోట్ల జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇప్పటి వరకు ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు సైనికులు అమరవీరులయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నిఘా ఏజన్సీల సమాచారం మేరకు జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల గాలింపు తీవ్రం చేశారు.