కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవలి అమెరికా పర్యటనలో దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి ప్రశ్నించిన ఇండియా టుడే జర్నలిస్టు రోహిత్ శర్మ మీద కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసారు. ఆ ఘర్షణ టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్‌లో రాహుల్ పర్యటన సమయంలో జరిగింది.
డాలస్‌లో రాహుల్ గాంధీ కార్యక్రమాలకు ముందు రోహిత్ శర్మ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శామ్ పిట్రోడాను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసారు. సాధారణంగానే మొదలైన ఇంటర్వ్యూ కొద్దిసేపటికే అరాచకంగా మారిపోయింది. రోహిత్ శర్మ అడిగిన ఒక ప్రశ్న కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆగ్రహాన్ని రెచ్చగొట్టింది. ‘అమెరికా ఎంపీలతో సమావేశమైనప్పుడు రాహుల్ గాంధీ బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యల గురించి చర్చిస్తారా’ అని రోహిత్ అడిగారు. ఆ ప్రశ్నకు పిట్రోడా జవాబు ఇవ్వకముందే సుమారు 30మంది కాంగ్రెస్ మద్దతుదారులు, రాహుల్ సన్నిహితులు విరుచుకుపడిపోయారు. ‘వివాదాస్పద ప్రశ్నలు’ అడుగుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ కార్యకర్తల గుంపు ఇంటర్వ్యూకు అంతరాయం కలిగించడమే కాకుండా, శామ్ పిట్రోడా మొబైల్‌ఫోన్‌ను లాక్కుని, అందులోని వీడియో రికార్డింగ్‌ను తొలగించడానికి ప్రయత్నించారు. ఆ పరిస్థితి చాలా వేగంగా చెయ్యి దాటిపోయింది. రోహిత్ శర్మను వేధించడమే కాకుండా పిట్రోడాతో ఇంటర్వ్యూను ముగించనీయకుండా అడ్డు పడ్డారు. తర్వాత, రాహుల్ గాంధీ రాకకు సన్నాహాల పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలు పిట్రోడాను అక్కడినుంచి తీసుకుని వెళ్ళిపోయారు.
రోహిత్ శర్మపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి అక్కడితో ఆగిపోలేదు. కనీసం 15మంది కార్యకర్తలు రోహిత్‌ను చుట్టుముట్టారు. ఇంటర్వ్యూ వీడియోలోనుంచి ఆ ప్రశ్నను తొలగించాలంటూ ఒత్తిడి చేసారు. ‘బంగ్లాదేశ్‌లో హిందువుల మీద హింసాకాండ’ అనే అంశం వివాదాస్పదం కాదని, అక్కడి ముస్లిముల పనులు అనైతికం అనీ రోహిత్ ఎంత చెప్పినా వినిపించుకోకుండా వారు వేధిస్తూనే ఉన్నారు. వారు అతని ఫోన్‌ని ఎలాగోలా అన్‌లాక్ చేసి ఇంటర్వ్యూ వీడియో మొత్తాన్నీ డిలీట్ చేసేసారు. ఏరోప్లేన్ మోడ్‌లో ఉన్నందున ఫోన్, క్లౌడ్‌తో సింక్ అయి లేదు. అందువల్ల బ్యాకప్ కూడా రికార్డ్ అవలేదు. తాను నరకం చూసిన ఆ అరగంటా ఓ పీడకల లాంటిదని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ‘‘వాళ్ళు చాలా డెస్పరేట్గా ఉన్నారు. ఆ చివరి ప్రశ్న జాడలేవీ ఎక్కడా మిగిలి ఉండకూడదన్నది వారి ఉద్దేశం’’ అని వివరించాడు.
కాంగ్రెస్ కార్యకర్తలు ఆ ఫోన్‌ను మరో నాలుగు రోజుల పాటు తమతోనే ఉంచుకున్నారు. పిట్రోడా ఇంటర్వ్యూ ఫుటేజ్ మరే ఇతర మార్గంలోనూ బైటకు రాకూడదని వారు ఆ జాగ్రత్త తీసుకున్నారు. తన ఫోన్ తిరిగి ఇచ్చేయాలని రోహిత్ ఎంత కోరినా వారు తగ్గలేదు, పైగా మరింత వేధించారు. ఒకదశలో రోహిత్ శర్మ ఆ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేద్దామనుకున్నాడు. కాంగ్రెస్ కార్యకర్తల వలయం నుంచి బైటపడ్డాక రోహిత్ శర్మ మరో ఫోన్ నుంచి శామ్ పిట్రోడాకు జరిగిన సంగతి అంతా టెక్స్ట్ చేసాడు. దానికి ఆయన, మర్నాడు మరోసారి ఇంటర్వ్యూ చేద్దామని చెప్పారు. కానీ ఆ మర్నాడు అనేది ఇప్పటివరకూ రానేలేదని రోహిత్ చెప్పుకొచ్చాడు.