నా మీద నమ్మకం ఉంటే నిరసన వదలి చర్చలకు రావాలంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన చేస్తోన్న జూనియర్ డాక్టర్లను అభ్యర్థించారు. ఆర్జి కర్ ఘటనకు నిరసనగా కోల్కతాలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం స్వర్ణభవన్ ముందు జూనియర్ వైద్యులు నెలరోజులపైగా నిరసన తెలుపుతున్నారు. నిందితులకు కఠిన శిక్ష విధిస్తామని ప్రభుత్వం చెబుతున్నా, ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు విధులను బహిష్కరించారు. దీంతో బెంగాల్ సీఎం నేరుగా ఇవాళ మధ్యాహ్నం జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తోన్న శిబిరం వద్ద దిగారు. నేను ఓ సీఎంగా రాలేదు. మీ అక్కగా వచ్చానంటూ చెప్పుకొచ్చారు. నేను కూడా విద్యార్దిగా ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేశానని, నిరసన తెలిపే హక్కు మీకు ఉందని, అయితే పేద రోగులు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే విధుల్లో చేరాలంటూ కోరారు. నిరసన తెలిపిన జూనియర్ డాక్టర్లపై ఎలాంటి చర్యలుండవని చెప్పుకొచ్చారు.
సమస్య పరిష్కారానికి ఇదే నా చివరి ప్రయత్నం అంటూ బెంగాల్ సీఎం చెప్పారు. శిబిరాల్లో జూనియర్ డాక్టర్లు ఎండకు వానకు తడుస్తూ నిరసన తెలుపుతుంటే, నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడపానంటూ మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే నా చివరి ప్రయత్నం, నాకు సీఎం పదవి ముఖ్యం కాదని మరోసారి పునరుద్ఘాటించారు.
ఆర్జి కర్ ఆసుపత్రిలో రోగుల సంరక్షణ కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలంటూ కోరారు. ప్రతి రోజూ 7 లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. నిందితుడికి సాధ్యమైనంత త్వరగా కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు.