జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఇవాళ ఉదయం భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ముందుగా అందిన నిఘా వర్గాల సమాచారం మేరకు సైన్యం, జేకే పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. శుక్రవారం అర్థరాత్రి ఉత్తర కశ్మీర్‌లోని పట్టాన్ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
నిఘా ఏజన్సీల సమాచారం మేరకు సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులతో కలసి సెప్టెంబరు 11న జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. జేకేలోని కిష్తార్ జిల్లాలో గత వారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ అధికారులు వీరమరణం పొందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేళ దోడా జిల్లాలో ప్రధాని మోదీ మెగా ర్యాలీకి ముందు ఎన్‌కౌంటర్లు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధాని ర్యాలీకి భద్రతను కట్టుదిట్టం చేశారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. గడచిన 42ఏళ్లలో ఒక ప్రధాని దోడా జిల్లాలో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1న జమ్మూ కశ్మీర్ ఎన్నికలు జరగనున్నాయి. పదేళ్ల తరవాత జేకేలో ఎన్నికలు జరుగుతున్నాయి.