రాబోయే మూడు రోజుల్లో ఏపీలో అక్కడక్కడా వానలు
బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతోనే కోస్తా బంగ్లాదేశ్, ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడుతుందని వివరించింది. ఆ తర్వాత రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా అల్పపీడనం బలపడుతుంది.
దీంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గడ్, బిహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌పై స్వల్ప ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. తీరం దాటిన తర్వాత ఈ నెల 18నాటికి రాష్ట్రానికి సమీపంగా రానుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో రాబోయే మూడు రోజుల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేసింది.
అలాగే ఈ నెల 23, 24 తేదీల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అది 28వ తేదీ నాటికి కోస్తా తీరానికి సమీపంలో తీవ్ర వాయుగుండం లేదా తుపానుగా బలపడనుంది. మచిలీపట్నం, కాకినాడ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 20 నుంచి అక్టోబర్ మొదటి వారం వరకూ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురువనున్నాయి.