నకిలీ నోట్ల ముఠాలు మరోసారి రెచ్చిపోతున్నాయి. అనంతపురం జిల్లా ధర్మవరం కేంద్రంగా గుట్టుగా వ్యవహారం నడిపిస్తున్నారు. కేటుగాళ్ల భారినపడి వ్యాపారులు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధర్మవరంలో చేనేత వస్త్రాలు కొనుగోలుకు పలు రాష్ట్రాల నుంచి వ్యాపారులు వస్తుంటారు. లక్షల్లో వ్యాపారాలు జరుపుతున్నారు. ఇదే అదనుగా నకిలీ ముఠాలు నోట్లు చలామణి చేస్తున్నాయి. లక్షకు నాలుగు లక్షలంటూ ఎరవేస్తున్నాయి. కొందరికి తెలియకుండానే చెల్లింపుల్లో నకిలీ నోట్లు కలిపేస్తున్నారు.
బ్యాంకుల్లో నకిలీ నోట్లు బయటపడుతున్నాయి. ఏజంట్లు చిన్న దుకాణాల్లోనూ రూ.500, రూ.200 నోట్లు చలామణి చేస్తున్నారు. నకిలీ నోట్లు బయటపడ్డా కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు. గత కొంత కాలంగా నకిలీ నోట్ల చలామణి అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, నిఘా ఉంచినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.
2023లో తాడిమర్రిలో నకిలీ నోట్లు చలామణి చేస్తోన్న వారిని కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి నకిలీ నోట్లు తీసుకువచ్చి చలామణి చేస్తున్నట్లు విచారణలో తేలింది. నకిలీ నోట్లు చేతులు మారడంలో కొందరు కానిస్టేబుళ్ల పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వస్తున్నాయి. దీనిపై కూడా విచారణ సాగుతోంది.