శ్రీశైలం ఆలయానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానానికి లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. క్షేత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, ప్రధానాలయ విస్తీర్ణం, అరుదైన శిల్పప్రాకారం, ప్రాచీన కట్టడాల ఆధారంగా శ్రీశైల ఆలయాన్ని లండన్ బుక్ ఆఫ్ రికార్డ్సు జాబితాలో చేర్చినట్లు ఆ సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ విభాగపు సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఉల్లాజి ఇలియాజర్ తెలిపారు.
ఆలయ పరిపాలనా కార్యాలయం సమావేశ మందిరంలో ఈవో పెద్దిరాజుకు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. శ్రీ క్షేత్రం భూమండలానికి నాభిస్థానంగా పేరొందిందని, అలాగే శ్రీశైలక్షేత్రంలో పుణ్యతీర్థాలు, సహజ జలధారలు మొదలైనవన్నీ క్షేత్ర ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని ఈవో అన్నారు.