దేశ రక్షణ సామర్థ్యాల ఆధునికీకరణలో మరో కీలక ఘట్టం నమోదైంది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భారత నావికాదళం ఉమ్మడిగా చేపట్టిన వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ పరీక్ష విజయవంతమైంది.
ఒడిశాలోని చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి డీఆర్డీవో శాస్ర్తవేత్తలు ఈ పరీక్ష నిర్వహించారు. వరుసగా రెండో పరీక్ష కూడా విజయవంతమవడంతో డీఆర్డీవో, నేవీ అధికారులు ఆనందం వ్యక్తం చేశారు.
సముద్ర ఉపరితలంపై చాలా తక్కువ ఎత్తులో అధిక వేగంతో పయనిస్తున్న లక్ష్యాన్ని క్షిపణి విజయవంతంగా ఛేదించింది. ఈ విజయంతో భారత రక్షణ సామర్థ్యాలు మరింత మెరుగయ్యాయి. సైనిక సాంకేతికతలో స్వావలంబన సాధించాలనే లక్ష్యంలో ఈ విజయాన్ని కీలకంఘట్టంగా పేర్కొనవచ్చు.