వైసీపీ నేతలు జోగి రమేశ్, దేవినేని అవినాశ్, లేళ్ళ అప్పిరెడ్డి, తలశిల రఘురాం, గవాస్కర్ లకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. గుంటూరు జిల్లా మంగళగిరి లోని టీడీపీ జాతీయ కార్యాలయంపై దాడి కేసులో సర్వోన్నత న్యాయస్థానం , అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 4కి వాయిదా వేసింది.
అలాగే 24 గంటల్లో దర్యాప్తు అధికారులకు పాస్‌పోర్టులు అందించాలని న్యాయస్థానం తెలిపింది.
దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరుకావాలని ఆదేశించిన సుప్రీంకోర్టు, సాంకేతిక కారణాలతో ఇవాళ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టలేకపోతున్నామని తెలిపింది. దర్యాప్తునకు సహకరించకపోతే రక్షణ ఉండదని జస్టిస్ సుధాన్షు దులియా, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం విచారణ సందర్భంగా స్పష్టం చేసింది.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడి కేసులో కూడా మాజీమంత్రి జోగి రమేశ్ నిందితుడిగా ఉన్నారు.
వైసీపీ నేతల తరఫున కపిల్ సిబల్, నీరజ్ కిషన్ కౌశల్, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు.