చట్టవిరుద్ధంగా, అక్రమంగా సామూహిక మతమార్పిడులకు పాల్పడుతున్న కేసులో నేరస్తులకు ఉత్తరప్రదేశ్ లఖ్‌నవూలోని ప్రత్యేక ఎన్ఐఎ కోర్టు మంగళవారం నాడు జీవితఖైదు విధించింది.
లఖ్‌నవూ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి వివేకానంద్ శరణ్ త్రిపాఠీ ఈ శిక్షను విధించారు. మౌలానా ఉమర్ గౌతమ్, మొహమ్మద్ కలీమ్ సిద్దికీ, మరో పదిమందికి జీవిత ఖైదు విధించారు. మరో నలుగురికి పదేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించారు.
కలీమ్ సిద్దికీ, తదితరులు వివిధ సంస్థలు, పాఠశాలల ద్వారా సామూహిక మతమార్పిడుల రాకెట్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణల మీద విచారణ జరిగింది. సిద్దికీ స్థాపించిన పాఠశాలలు, సంస్థలకు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు వస్తున్నాయని విచారణలో స్పష్టమైంది.
కలీమ్ సిద్దికీని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 2021 సెప్టెంబర్‌లో అరెస్ట్ చేసింది. బలవంతపు మతమార్పిడులే కాకుండా, విభిన్న మతాల వ్యక్తుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడని, భారతదేశపు సమగ్రతనూ, సార్వభౌమత్వాన్నీ దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాడనీ అతనిపై ఆరోపణలున్నాయి.
భారతదేశ రాజ్యాంగం మీద యుద్ధం ప్రకటించడం, భారత రాజ్యాంగాన్ని తీసివేసి దానిస్థానంలో షరియా చట్టాన్ని అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న జాతీయస్థాయి నెట్‌వర్క్‌కు సిద్దికీయే సూత్రధారి అని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. భారీస్థాయిలో అక్రమ మతమార్పిడులు జరుపుతున్న రాకెట్‌తో సిద్దికీకి సంబంధాలున్నాయి. అతను స్వయంగా మతమార్పిడులు చేయడం మాత్రమే కాదు, ఆ పని చేసేందుకు పలు మదరసాలకు డబ్బులు కూడా ఇచ్చాడు.
ఇంక ఉమర్ గౌతమ్‌కు మతమార్పిడులు చేయడానికి వివిధ దేశాల నుంచి నిధులు వచ్చేవి. ఇస్లామిక్ రాజ్యాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా ఉమర్ గౌతమ్ బలవంతపు మతమార్పిడులు చేసేవాడు. బలహీన మనస్కులను గుర్తించి వారిపై మానసికంగా ఒత్తిడి తెచ్చి, వారు మతం మారేలా చేసేవాడు. భిన్న మతాలకు చెందిన వారిమధ్య గొడవలు రేపడం, దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికీ హాని చేకూర్చడం, ముస్లిమేతరులను ఇస్లాంలోకి మారేలా ప్రభావితం చేయడం అన్న ఆరోపణల మీద విచారణ జరిగింది.
ఉమర్ గౌతమ్, అతని సహచరులు కలిసి సమాజంలోని బలహీన వర్గాలను, పిల్లలను, మహిళలను, ఎస్సీ ఎస్టీ వర్గాలను లక్ష్యంగా చేసుకున్నారు. పెద్దసంఖ్యలో ప్రజలను మతం మార్చడం ద్వారా దేశ జనాభా స్వరూపాన్ని మార్చివేయాలన్నది వారి కుట్ర. సమాజంలో శాంతి సౌహార్దతలకు భంగం కలిగించి ప్రజాజీవితాన్ని అతలాకుతలం చేయాలన్నది వారి లక్ష్యమని కేసు విచారణలో నిరూపితమైంది.