బారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం కోసం సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్ళిన దోవల్, అక్కడే పుతిన్‌తో గురువారం నాడు భేటీ అయారు. వారిద్దరూ చేతులు కలుపుకున్న చిత్రాన్ని భారత్‌లోని రష్యా దౌత్య కార్యాలయం ట్వీట్ చేసింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చారిత్రక ఉక్రెయిన్ పర్యటన జరిగిన రెండున్నర వారాల తర్వాత దోవల్ రష్యాలో పర్యటిస్తున్నారు. మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపినప్పుడు ఉక్రెయిన్, రష్యా రెండు దేశాలూ కలిసి కూర్చుని చర్చించుకోవాలనీ, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలనీ చెప్పారు. అవసరమైతే ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించేందుకు క్రియాశీలక పాత్ర పోషించడానికి భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు.
ఇప్పుడు అజిత్ దోవల్ రష్యా పర్యటన ప్రధాన ఉద్దేశం రష్యా-ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికే అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రధాని మోదీ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తెలియజేయడం అజిత్ దోవల్ ప్రధాన లక్ష్యమని తెలుస్తోంది.
దోవల్‌తో చర్చల్లో పుతిన్, వచ్చే నెల కజాన్‌లో జరగబోయే బ్రిక్స్ వార్షిక సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేసారు. ఆ సందర్భంగా అక్టోబర్ 22న మోదీతో పుతిన్ నేరుగా ద్వైపాక్షిక చర్చలు జరపడానికి ప్రతిపాదించారు. మోదీ గత మాస్కో పర్యటన సమయంలో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు ఎలా జరుగుతోందన్న విషయాన్ని, సమీప భవిష్యత్తులో ఉన్న అవకాశాల గురించీ వారిద్దరూ చర్చిస్తారని రష్యా దౌత్య కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.
బుధవారం నాడు అజిత్ దోవల్ రష్యా జాతీయ భద్రతా సలహాదారు సెర్గేయ్ షోయిగుతో చర్చలు జరిపారు. ఇరుదేశాలకూ పరస్పర ఆసక్తి ఉన్న అంశాల మీద వారిద్దరూ మాట్లాడుకున్నారు. ఆగస్టు 23న మోదీ జెలెన్స్కీల చర్చలకు కొనసాగింపుగా ఇప్పుడు భారత్-ఉక్రెయిన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగినట్లు తెలుస్తోంది.