హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీకి, కాంగ్రెస్‌కు మధ్య పొత్తు విఫలమవడంతో ఆ రాష్ట్రంలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక, నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది. మరికొన్ని రాష్ట్రాల్లో దెబ్బతీసినట్లే కాంగ్రెస్ విజయావకాశాలను హర్యానాలో కూడా ఆప్ దెబ్బతీయనుంది. ఆ పరిస్థితిని ముందుగా గ్రహించినందుకే కాంగ్రెస్, హర్యానాలో ఆప్‌తో పొత్తు కోసం తహతహలాడింది.
అయినప్పటికీ కాంగ్రెస్‌లోని వర్గపోరు కారణంగా ఆ పొత్తు సాధ్యం కాలేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ హర్యానాలో ఆప్‌తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి కురుక్షేత్ర ఒకే ఒక సీటు కేటాయించింది. రాహుల్ గాంధీకి ఆప్‌తో పొత్తు ఇష్టమే కానీ హర్యానా కాంగ్రెస్‌లోని భూపీందర్‌సింగ్ హూడా వర్గం పడనివ్వలేదు. అందువల్ల ఆప్ ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన సామర్థ్యం మేరకు వీలైనన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్ విజయావకాశాలకు సైతం భారీ గండి కొడుతుంది. రాబోయే ఎన్నికల్లో హర్యానాలో కాంగ్రెస్ తమతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి కల్పిస్తుంది.
హర్యానా వ్యవహారాన్ని చూస్తుంటే కాంగ్రెస్ తన పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకోలేదని అర్ధమవుతుంది. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ రంగప్రవేశంతో కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో కనీవినీ ఎరుగనంత దారుణ పరాభవాన్ని మూటకట్టుకోవలసి వచ్చింది. ఆఖరికి ఆ రాష్ట్రం నుంచి ఒకేఒక్క రాజ్యసభ ఎంపీని గెలిపించుకోవడం కూడా కాంగ్రెస్‌కు కనాకష్టంగా మారింది. కాంగ్రెస్ కేవలం 17 స్థానాలకే పరిమితమైంది, ఫలితంగా ఆ పార్టీ గుజరాత్ శాసనసభలో కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కని స్థితికి దిగజారింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 41 శాసనసభా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయింది. గుజరాత్‌లో కాంగ్రెస్ అత్యంత చెత్త ఎన్నికల ప్రదర్శన అది. ఆ పరిస్థితికి కారణం ఆ రాష్ట్రంలోకి ఆమ్ ఆద్మీ పార్టీ అడుగు పెట్టడమే. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 181 స్థానాల్లో పోటీ చేసింది. 40 స్థానాల్లో మొదటి లేదా రెండవ స్థానంలో నిలవగలిగింది. దురదృష్టవశాత్తు ఆ 40 స్థానాల్లోనూ ఆప్ బీజేపీతో పోటీపడింది. వాటిలో 35 సీట్లను బీజేపీ గెలుచుకుంది. మిగతా ఐదింటినీ ఆప్ గెలుచుకుంది. 2022 గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాలను బట్టి ఆమ్ ఆద్మీ పార్టీ కొల్లగొడుతున్న ఓటుబ్యాంకు కాంగ్రెస్‌దేనని తేటతెల్లం అయిపోయింది.
కాంగ్రెస్‌పై ఆప్ ఆధిక్యానికి మరో ఉదాహరణ ఢిల్లీ ఎన్‌సిటి. ఢిల్లీలో షీలా దీక్షిత్ నాయకత్వంలో కాంగ్రెస్ వరుసగా మూడుసార్లు 1998లోనూ, 2003లోనూ, 2008లోనూ విజయాలు సాధించింది. అయితే 2013 ఎన్నికల్లో మొట్టమొదటిసారి కాంగ్రెస్‌ను ఆప్ బలహీనపరిచింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్‌ను పూర్తిగా అధిగమించింది. కాంగ్రెస్ పూర్తిగా బ్లాంక్ అయిపోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం 70 స్థానాల్లోనూ పోటీ చేసింది, కానీ 62 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 66 స్థానాల్లో పోటీ చేసి 63 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. నిజానికి ఎన్‌సిటి ఢిల్లీ మామూలుగా కాంగ్రెస్ కంచుకోట. 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం ఏడింట ఆరు స్థానాలను గెలుచుకుంది. 2009లో అయితే మొత్తం ఏడు స్థానాలనూ సాధించింది.
మొత్తం మీద కాంగ్రెస్‌కు ఆప్ ఎప్పుడూ ఒక కుషన్‌లాగే పనిచేసింది. పంజాబ్‌లో ఆప్ 2022లో కాంగ్రెస్‌ను ఓడించి మొత్తం 117 సీట్లకు గాను 92స్థానాల్లో విజయం సాధించిది. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 31 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. 1951లో ఆ పార్టీ మొదటిసారి ఎన్నికల్లో పాల్గొన్న నాటి నుంచీ ఆ పార్టీ ఒక రాష్ట్ర ఎన్నికల్లో కోల్పోవడం అదే మొదటిసారి.