బంగ్లాదేశ్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, నేడు అల్పపీడనంగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD)అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం ఈ నెల 15న బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉండబోదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
మరో వైపు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. గురువారం అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు తీవ్రంగా నమోదు అయ్యాయి. కావలిలో 38.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో వారం పాటు ఇదే వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
దేశ వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాల తిరోగమనం ఈ నెల 19 నుంచి 25 మధ్య నుంచి ప్రారంభం కావచ్చని జాతీయ వాతావరణ విభాగం అంచనా వేసింది. తిరోగమనానికి అనుకూల వాతావరణం ఏర్పడిందని వివరించింది.
సాధారణంగా జూన్ 1న దేశంలోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు జులై 8 నాటికి దేశమంతా విస్తరిస్తాయి. తిరిగి సెప్టెంబరు 17 నుంచి తిరోగమనం ప్రారంభిస్తాయి. అక్టోబరు 15 నాటికి పూర్తిగా నిష్క్రమిస్తాయి.
ఈ ఏడాది నైరుతి రుతుపవన కాలంలో దేశ వ్యాప్తంగా 836.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం 772.5 మిల్లీమీటర్ల కంటే ఎనిమిది శాతం ఎక్కువ. కానీ తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో 16 శాతం లోటు వర్షపాతం నమోదైంది.