ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న పదో తరగతి విద్యార్ధులు ఈ ఏడాది స్టేట్ బోర్డు పరీక్షలు రాసేందుకు అనుమతిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి బోధనలో నాణ్యత పెంచి, విద్యార్ధుల సామర్థ్యాలు పెంచేలా చర్యలు తీసుకుంటామని లోకేశ్ స్పష్టం చేశారు. విద్యార్ధుల సామర్ధ్యాలు పెంచాలని అధికారులను ఆదేశించారు. పదో తరగతి ఫెయిల్ అయితే విద్యార్థుల జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ప్రభుత్వ సీబీఎస్ఈ పాఠశాలల్లో 77వేల మంది విద్యార్థులు ఉన్నారని ఆయన గుర్తు చేశారు.
సీబీఎస్ఈ పాఠ్యాంశాల బోధనలో ఉపాధ్యాయులకు ముందుగా శిక్షణ ఇవ్వకుండానే వెయ్యి పాఠశాలలకు గత ప్రభుత్వం అనుమతి తీసుకుందని మంత్రి లోకేశ్ గుర్తుచేశారు. విద్యార్ధులకు సీబీఎస్ఈ పాఠాలు బోధించే విధంగా ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తామన్నారు.
సీబీఎస్ఈ బడుల్లో చదువుతున్న 64 శాతం మంది విద్యార్థులకు సరైన సామర్థ్యం లేదనే విషయం, ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైందన్నారు. 326 పాఠశాలల్లో ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేదన్నారు.మరో 556 బడుల్లో పాసైన విద్యార్థుల సంఖ్య 25 శాతం లోపే ఉందన్నారు. సీబీఎస్ఈ విద్యార్థులు స్టేట్ బోర్డు పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు.