విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం పీఎం ఈ – డ్రైవ్ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద విద్యుత్ ద్విచక్ర వాహనం కొనుగోలు చేస్తే గరిష్టంగా పది వేలు రాయితీ లభించనుంది. రెండో ఏడాది ఆ మొత్తం రూ.5వేలకు తగ్గనుంది. ఈ విషయాన్ని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమార స్వామి తెలిపారు.
రూ. 14,335 కోట్ల తో రెండు పథకాలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవెల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్ హాన్స్ మెంట్ (పీఎం ఇ – డ్రైవ్) పథకానికి రూ.10,900 కోట్లు కేటాయించారు. రెండేళ్ల పాటు ఈ పథకం అమల్లో ఉంటుంది. ఇదే తరహాలో ఈ రిక్షాలకు రూ.25వేలు, రెండో ఏడాది రూ.12,500 వంతున కేంద్రం చెల్లించనుంది.
ఈ పథకం కింద లబ్దిపొందాలంటే పీఎం ఈ – డ్రైవ్ పోర్టల్ లో ఆధార్ ఆధారిత ఈ – వోచరును జనరేట్ చేసుకోవాలి. దానిపై కొనుగోలుదారులు, డీలర్ సంతకాలు చేసి పోర్టల్ లో అప్ లోడ్ చేయాలి. అనంతరం కొనుగోలుదాడుడు సెల్ఫీని కూడా అప్ లోడ్ చేయాలని కేంద్రప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.