తెలుగు యాత్రీకులు ఉత్రరాది వరదల్లో చిక్కుకుపోయారు. ఈ నెల 10వ తేదీన సదరన్ ట్రావెల్స్ ద్వారా 18 మంది కేదార్‌నాథ్ వెళ్లారు. భారీ వర్షాలకు వరదలు రావడంతో వారంతా అక్కడే చిక్కుకుపోయారు. వారిలో 14 మంది బద్రీనాథ్ వెళ్లారు. అతి భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడి రవాణా స్థంభించిపోయింది. బాధితుల్లో విజయనగరం, నిజామాబాద్ యాత్రీకులు ఎక్కువగా ఉన్నారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో హెలికాఫ్టర్ సేవలు కూడా నిలిపేశారు.
బాధితులతో విజయనగరం టీడీపీ ఎంపీ అప్పలనాయుడు ఫోన్లో మాట్లాడారు. వారి సమస్యలను కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. యాత్రీకులను రక్షించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. యాత్రీకుల్లో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
యాత్రీకులను కాపేడేందుకు ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ అధికారులు రంగంలోకి దిగారు. వాతావరణం అనుకూలిస్తే వెంటనే హెలికాఫ్టర్ ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. బాధితులకు వెంటనే మందులు, ఆహారం అందించాలని కేంద్ర మంత్రి ఉత్తరాఖండ్ అధికారులను ఆదేశించారు.