హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేశ మంటపం తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి కలిగిన గణపతి మంటపం. ఏటా వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్‌లో గణపతి నవరాత్రులు జరుపుతారు. ఈ యేడాది వేడుకల్లో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల ఘోష్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సెప్టెంబర్ 10, మంగళవారం నాడు హైదరాబాద్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు ఖైరతాబాద్ వినాయకుడి ముందు ఘోష్ నిర్వహించారు. 70 అడుగుల ఎత్తయిన వినాయకుడి ముందు 75 మంది స్వయంసేవకులు వివిధ వాద్యాలతో సంగీత నివేదన చేసారు. సంఘ గణవేషలో పాల్గొన్న స్వయంసేవకులు ఘోష్‌లో ఉపయోగించే పలు సంగీత పరికరాలతో బ్యాండ్ వాయించారు. ప్రత్యేకించి పిల్లనగ్రోవి (వంశీ) మీద ఆలపించిన రచనలు గణేశుడి భక్తులను రంజింపజేసాయి.
ఖైరతాబాద్‌లో గణపతి మంటపాన్ని శంకరయ్య అనే స్వాతంత్ర్య సమరయోధుడు 1954లో మొదటిసారి ఏర్పాటు చేసారు. వినాయక చవితి సందర్భంగా దేశంలో ఏర్పాటు చేసే అతి ఎత్తయిన వినాయక విగ్రహాల్లో ఒకటిగా ఖైరతాబాద్ గణేశుడు ప్రఖ్యాతినందాడు. 70యేళ్ళ ఖైరతాబాద్ గణపతి మంటపం చరిత్రలో స్వయంసేవకులు ఘోష్ నిర్వహించడం ఇది మూడోసారి.