కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అమెరికా పర్యటన ఆద్యంతం వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలను ఎదుర్కొంది. భారతదేశాన్ని, దేశంలోని వివిధ వ్యవస్థలనూ అప్రతిష్ఠ పాలు చేయడమే లక్ష్యంగా రాహుల్ విదేశీ గడ్డ మీద వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా సిక్కు సమాజాన్ని, ఆర్ఎస్ఎస్ను, ప్రధానమంత్రి నరేంద్రమోదీని టార్గెట్ చేసుకున్నారు. అలాగే తెలుగు భాష గురించి, తెలంగాణా గురించి చేసిన వ్యాఖ్యలకు భారతదేశం నుంచి బలమైన ప్రతిస్పందనలు వెలువడ్డాయి.
రాహుల్ తన అమెరికా పర్యటనలో పలువురు అమెరికా ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. వారిలో కొంతమంది కరడుగట్టిన భారత వ్యతిరేక వైఖరి కలిగినవారున్నారు. ఆ సమావేశాన్ని బ్రాడ్లే జేమ్స్ షెర్మన్ అనే అమెరికన్ ఎంపీ ఏర్పాటు చేసారు. వాషింగ్టన్ డిసిలోని రేబర్న్ హౌస్ ఆఫీస్ బిల్డింగ్‌లో నిర్వహించిన ఆ సమావేశంలో ఇలాన్ ఓమర్, రో ఖన్నా, బార్బరా లీ, జొనాథన్ జాక్సన్, రాజా కృష్ణమూర్తి, శ్రీ ఠాణేదార్, జీసస్ జి చుయ్ గార్షియా, హాంక్ జాన్సన్, జాన్ స్కకోవ్స్కీ తదితరులు పాల్గొన్నారు. వారిలో ఇలాన్ ఓమర్, రో ఖన్నా గతంలో భారతదేశం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. అలాంటి వారితో రాహుల్ గాంధీ సమావేశం అవడంపై ప్రవాస భారతీయులు ఆందోళన వ్యక్తం చేసారు. అటువంటి అమెరికన్ ఎంపీలతో రాహుల్ గాంధీ సమావేశం భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న మంచిపేరును పాడుచేస్తుందని, మరింత విమర్శల పాలుచేస్తుందనీ ఆవేదన వ్యక్తం చేసారు.
రాహుల్ భేటీ అయిన ఎంపీల పేర్లను కాంగ్రెస్ పార్టీ ధ్రువీకరించింది. అయితే వారితో రాహుల్ గాంధీ ఏ విషయాలు చర్చించారన్న సంగతిని వెల్లడించలేదు. దాంతో వారు ఏ విషయాల గురించి మాట్లాడుకున్నారు, ఆ చర్చల సారం ఏమిటి అన్నదానిపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రత్యేకించి, భారత వ్యతిరేక ధోరణి కలిగిన వ్యక్తులతో రాహుల్ ఏం చర్చించి ఉంటారన్న విషయంపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. రాహుల్ కేవలం ఒక వ్యక్తి కాదు, ఈ దేశంలో ప్రభావశీలమైన కుటుంబానికి వారసుడు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్లో ఒకడు. అటువంటి నాయకుడు, భారత్‌ను ద్వేషించే వ్యక్తులతో భేటీ అయ్యి చర్చించే విషయాలు ఏముంటాయి, అవి భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపును ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాన్ అబ్దుల్లాహీ ఒమర్ సొమాలియా మూలాలున్న అమెరికన్ రాజకీయవేత్త, మిన్నెసోటా రాష్ట్రం నుంచి ప్రజా ప్రతినిధి, డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలు. ఇస్లాం, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా మీద ఆమె అభిప్రాయాలు వివాదాస్పదమైనవి. సొమాలియాలో పుట్టిన ఇలాన్ ఒమర్, ఆ దేశంలో అంతర్యుద్ధం కారణంగా తన పన్నెండవ ఏట అమెరికాకు శరణార్థిగా వచ్చేసింది. తర్వాత అమెరికా పౌరురాలయింది. ఆ దేశ రాజకీయాల్లో ప్రవేశించిన మొదటి సొమాలీ-అమెరికన్‌గా నిలిచింది. యుఎస్ కాంగ్రెస్‌కు ఎన్నికైన మొదటి ఇద్దరు ముస్లిం మహిళల్లో ఒకర్తె.
2019లో ఇలాన్ ఒమర్ మీద ఇమిగ్రేషన్ మోసానికి పాల్పడిన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఆరోపణల మీద విచారణ జరిపించాలని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేసారు. అలాంటి విచారణ ఏమీ జరగలేదు కానీ ఆ ఆరోపణల ఆధారంగా అమెరికన్ ముస్లిములను ఆమె ఆకట్టుకోగలిగింది.
ఇలాన్ ఒమర్ భారతదేశ విధానాలను నిరంతరం విమర్శిస్తుంది. ప్రత్యేకించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ విధానాలపై తీవ్రంగా విరుచుకుపడుతుంది. గతంలో మోదీ అమెరికా పర్యటనను ఆమె బహిష్కరించింది. జమ్మూకశ్మీర్‌లో 370 అధికరణాన్ని తొలగించడాన్ని వ్యతిరేకించింది. అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ అనుకూల వాదనలు చేస్తుంది. అమెరికన్ కాంగ్రెస్‌లో కశ్మీర్ అంశాన్ని పదేపదే ప్రస్తావించడం ఆవిడకు సరదా. కశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందనీ అక్కడ అమెరికా జోక్యం చేసుకోవాలనీ వాదించడంలో దిట్ట. 2022లో పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించింది. భారతదేశంలో ముస్లిములపై వివక్ష చూపుతున్నారంటూ ప్రచారం చేయడం ఇలాన్ ప్రత్యేకత.
ఇలాన్ ఒమర్‌కు రాడికల్ ఇస్లామిక్ గ్రూపులతో ఉన్న సంబంధాలపై చాలా విమర్శలున్నాయి. పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబాతో సంబంధాలున్న ఇస్లామిక్ రిలీఫ్, హెల్పింగ్ హ్యాండ్ ఫర్ రిలీఫ్ అండ్ డెవలప్మెంట్ వంటి సంస్థలతో కలిసి పనిచేసిన చరిత్ర ఆమెది. రాజకీయ సలహాల ముసుగులో ఇలాన్ అతివాద గ్రూపుల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని ఆమెపై అమెరికాలో విమర్శలున్నాయి.
ఇలాన్ ఒమర్‌కు ముస్లిం బ్రదర్హుడ్ అనే అంతర్జాతీయ ఇస్లామిస్టు సంస్థతోనూ, కతార్ పాలకులతోనూ ఉన్న సంబంధాలపై బోలెడన్ని విమర్శలున్నాయి. అమెరికాలో ముస్లిం సిద్ధాంతాలను ప్రచారం చేస్తుందనీ, ముస్లిం వర్గాలకు ఆమె అధికార ప్రతినిధిలా పనిచేస్తుందనీ ఆరోపణలున్నాయి. ఇజ్రాయెల్ వ్యతిరేకత, పాలస్తీనా అనుకూలత, హమాస్ వంటి ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఆమె లక్షణాలు.
రాహుల్ గాంధీ అమెరికా పర్యటనను విమర్శకులు భారత్‌కు సమస్యాత్మకమైనదిగా పరిగణిస్తున్నారు. రాహుల్ యుఎస్‌లో పర్యటించిన సమయాన్ని చూస్తే అందులో డీప్‌స్టేట్ ప్రమేయమున్న కుట్ర ఉండి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. పాకిస్తాన్, చైనాలతో చేతులు కలిపిన శత్రువులు భారతదేశంలో అస్థిరత కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్రత్యేకించి మన పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో పరిణామాలు గమనించిన తర్వాత రాహుల్ అమెరికా పర్యటన నేపథ్యాన్ని గమనిస్తే దేశానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.