తెలంగాణలోని కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ పట్టణంలో గిరిజన మహిళపై అత్యాచారం-హత్యా ప్రయత్నాన్ని జాతీయ మానవహక్కుల కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఆ ఘటన గురించి రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డిజిపిలకు నోటీసులు జారీ చేసింది. ఆ నివేదికలో ఎఫ్ఐఆర్ ప్రస్తుత స్థితి, బాధితురాలి ఆరోగ్య పరిస్థితి, ఆమెకు రాష్ట్రప్రభుత్వం నుంచి పరిహారం వంటి వివరాలు ఉండవచ్చు.
జైనూర్ ఘటన ఆగస్టు 31న జరిగింది. ఆ సంఘటన ఆ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలకు, హింసాకాండకూ దారితీసింది. 45ఏళ్ళ గిరిజన మహిళ రహదారి మీద ఉండగా షేక్ మగ్దూమ్ అనే ఆటోడ్రైవర్ ఆమెను సొయంగూడ గ్రామానికి తీసుకువెడతానని ఆటో ఎక్కించుకున్నాడు. ఆటో రాఘవపూర్ గ్రామానికి చేరుకున్నాక షేక్ మగ్దూమ్ ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆ మహిళ ప్రతిఘటించడంతో ఆమెను బలంగా కొట్టాడు. ఆ మహిళ స్పృహ కోల్పోతే, మరణించిందనుకుని అక్కడినుంచి పారిపోయాడు.
కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన మహిళ ప్రధాన రహదారి మీదకు పాక్కుంటూ వచ్చింది. అక్కడున్న జనాలు ఆమె దురవస్థ చూసి జైనూర్ ఆరోగ్యకేంద్రానికి చేర్చారు. తర్వాత ఆమెను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి, అక్కణ్ణుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికీ తరలించారు. బాధితురాలు ఇప్పటికీ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
మత ఉద్రిక్తతలు, హింసాకాండ:
ఆ సంఘటనతో కోపోద్రిక్తులైన గిరిజన సంఘాలు ఆందోళన ప్రారంభించాయి. బాధితురాలికి న్యాయం చేయాలన్న డిమాండ్‌తో నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఆందోళనకారులను ముస్లిం వర్గం మరింత రెచ్చగొట్టింది. పరస్పరం దాడులు జరిగాయి. ఆ క్రమంలో దుకాణాలు, వ్యాపార సంస్థలను తగులబెట్టారు. ఒక మతానికి చెందిన ప్రార్థనా స్థలం మీద రాళ్ళు రువ్విన ఘటనతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. సామాజిక మాధ్యమాల ద్వారా మతపరమైన ఉద్రిక్తతలను వ్యాపింపజేయకుండా నిలువరించడం కోసం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసారు. హింసాకాండ పెచ్చుమీరకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించారు.
ఎన్‌హెచ్ఆర్‌సి స్పందన:
జైనూర్ ఘటన గురించి మీడియాలో వచ్చాక, సెప్టెంబర్ 5న జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఆ సంఘటనలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి సమగ్ర నివేదిక కోరింది. దర్యాప్తు స్థితి ఏమిటి, బాధితురాలి ఆరోగ్యం ఎలా ఉంది, ఆమెకు ప్రభుత్వం తరఫున కౌన్సెలింగ్ అందుతోందా, బాధితురాలికి చెల్లించాల్సిన పరిహారం వంటి వివరాలతో నివేదిక అందజేయాలని కోరింది. ఆ కేసులో నిందితుడైన ఆటోడ్రైవర్ షేక్ మగ్దూమ్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. అత్యాచార ప్రయత్నం, హత్యాప్రయత్నం, ఎస్సీఎస్టీ వేధింపుల నివారణ చట్టం ఉల్లంఘన అన్న నేరాలకు పాల్పడినట్లు కేసు పెట్టారు.
జైనూర్‌లో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి, బాధితురాలికి న్యాయం చేయడానికీ తక్షణం చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్ఆర్‌సి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. రెండువారాల్లోగా తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నివేదిక వచ్చిన తర్వాత కమిషన్ తన తదుపరి కార్యాచారణను నిర్ణయిస్తుంది.
జైనూర్‌లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నా, ప్రస్తుతానికి అదుపులోనే ఉంది. ఇప్పటికే అక్కడ అదనపు బలగాలను మోహరించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించేవరకూ, బాధితురాలికి న్యాయం జరిగేవరకూ ఆందోళనలు కొనసాగుతాయని గిరిజన నాయకులు స్పష్టం చేసారు.
ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకూ 16మంది వ్యక్తులను అరెస్ట్ చేసారు. వారిని రిమాండ్ కోసం ఆదిలాబాద్, కరీంనగర్ జైళ్ళకు తరలించారు. సిసిటివి ఫుటేజ్ సాయంతో మిగతా నిందితులను పట్టుకోడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్, ఉట్నూర్, ఆసిఫాబాద్ జిల్లాల్లో వాహనాల రాకపోకలపై నియంత్రణలు విధించారు. ప్రత్యేకించి జైనూర్‌లోకి ఎలాంటి వాహనాలనూ అనుమతించడం లేదు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన, అటవీ ప్రాంతాల్లోకి ముస్లిములు చొచ్చుకువెళ్ళడం, అక్కడ పెద్దసంఖ్యలో ముస్లిములు నివాసాలు ఏర్పాటు చేసుకుంటూండడం కొంతకాలంగా ఆందోళనకరస్థాయికి చేరుకుంది. ఇప్పుడా ముస్లిములు గిరిజనులపై దాడులు, అత్యాచారాలకు పాల్పడుతుండడం కొత్త ప్రమాదాలకు కారణమవుతోంది.