గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 15 లక్షల క్యూసెక్కుల వరద వదులుతున్నారు. అధికారులు రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తోన్న వరదతో ఉభయగోదావరి జిల్లాల్లోని సుమారు 110 లంక గ్రామాలు నీట మునిగాయి.వశిష్ఠ, వైనతేయ, గౌతమి పాయలు పొంగి లంకగ్రామాలను ముంచాయి. వేలాది ఎకరాల్లో పంటపొలాలు నీటమునిగాయి.
పి.గన్నవరం మండలంలోని పలు లంకగ్రామాలు నీట మునిగాయి. రోడ్లు మునిగిపోవడంతో ప్రజలు పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. మామిడికుదురు మండలంలోని పలు లంక గ్రామాలు నీట మునిగాయి. వరి, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వృద్ధ గౌతమి వరద పెరుగుతోంది. కాట్రేనికోట పుష్కరఘాట్ మునిగిపోయింది. తాళ్లరేవు మండలంలో పలు గ్రామాలు వరద భారిన పడ్డాయి.
పంట నష్టపోయిన రైతులకు ఎకరా వరి పంటకు పదివేల పరిహారం ప్రకటించారు. పంట నష్టం అంచనాలు వేసేందుకు గ్రామ సచివాలయ సిబ్బందిని రంగంలోకి దింపారు. వరద నష్టం పరిశీలించేందుకు కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి.