మదర్సాల్లో పిల్లలకు సరైన విద్య బోధించడం లేదని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తెలిపింది. చట్టవిరుద్ధంగా వ్యవహరించడంతో పాటు పాఠ్యపుస్తకాల్లో అభ్యంతకర అంశాలు కనిపిస్తున్నాయని ఈ మేరకు సుప్రీంకోర్టులో తాజాగా సమగ్ర అఫిడవిట్ సమర్పించింది.
నాణ్యమైన, సమగ్ర విద్య పొందాలనే బాలల ప్రాథమిక హక్కు మదర్సాల్లో ఉల్లంఘనకు గురవుతోందని అఫిడవిట్ లో పేర్కొంది.
విద్యాహక్కు చట్టం–2009 సైతం ఉల్లంఘనకు గురికావడంతో పాటు మదర్సాల్లో తగిన విధంగా బోధన జరగడంలేదని తెలిపింది. జీవితంలో పైకి ఎదిగే అవకాశాలు ఏమాత్రం లేవని తేల్చి చెప్పింది.
బిహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో ముస్లిమేతరులను సైతం చేర్చుకొని, ఇస్లామిక్ మత విద్య బోధిస్తున్నారని ప్రస్తావించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 28(3)కు విరుద్ధంగా వ్యవహరించడమేనని పేర్కొంది.
విద్యాహక్కు చట్టం సెక్షన్ -29లో పేర్కొన్న మూల్యాంకన విధానాలు అమలు కావడం లేదని, అర్హత లేని వారిని ఉపాధ్యాయులుగా నియమించుకుంటున్నారని పేర్కొంది. నిధుల విషయంలోనూ పారదర్శకత కనిపించడం లేదని తెలిపింది.అత్యున్నత మతం ఇస్లాం మాత్రమే అంటూ పిల్లల మెదళ్లలోకి ఎక్కిస్తున్నారు అని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పేర్కొంది.