మైనర్ బాలికను మాయమాటలతో లొంగదీసుకుని గర్భవతిని చేసిన కేసులో ఒక చర్చి పాస్టర్‌కు న్యాయస్థానం 20ఏళ్ళ జైలుశిక్ష విధించింది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
గుంటూరు ఐదవ అదనపు జిల్లా జడ్జి సోమవారం నాడు ఈ కేసులో తీర్పు ఇచ్చారు. నేరస్తుడిగా నిరూపణ అయిన పాస్టర్ ఎన్ కోటేశ్వరరావుకు పోక్సో చట్టం కింద శిక్ష విధించారు. 20 ఏళ్ళ జైలుశిక్షతో పాటు రూ.లక్ష జరిమానా కూడా విధించారు. తమ మతాన్ని విశ్వసించేవారికి ఆధ్యాత్మికంగా మార్గదర్శనం చేయవలసిన పవిత్ర బాధ్యతలో ఉన్న వ్యక్తి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని మైనర్ బాలికను లొంగదీసుకుని ఆమెపై లైంగిక దాడి చేయడాన్ని న్యాయస్థానం తీవ్రమైన నేరంగా పరిగణించింది. ఆరేళ్ళ పాటు విచారణ జరిగిన కేసులో ఎట్టకేలకు సోమవారం నాడు తీర్పు వెలువడింది.
2018 నాటి ఈ కేసు వివరాలు ఇలా న్నాయి. గుంటూరు జిల్లా వెంకటపాలెం గ్రామంలో ఒక చిన్న చర్చిలో కోటేశ్వరరావు పాస్టర్‌గా పనిచేసేవారు. ఆ చర్చికి పదిహేనేళ్ళ బాలిక క్రమం తప్పకుండా వెడుతుండేది. పాస్టర్ హోదాలో ఉన్న కోటేశ్వరరావు ఆ బాలికను మాయమాటలతో లొంగదీసుకున్నాడు. తర్వాత ఆమెను భయపెట్టి, బెదిరించి లైంగికంగా వేధించసాగాడు.
కొన్నాళ్ళకు బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ ఆమె గర్భవతి అని తేలింది. అప్పుడు ఆ బాలిక పాస్టర్ వేధింపుల గురించి బైటపెట్టింది. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు పాస్టర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. సుమారు ఆరేళ్ళ విచారణ తర్వాత ఇప్పుడు తీర్పు వెలువడింది.
న్యాయస్థానం వరకూ కేసు రావడంతో ఈ వ్యవహారంలో పాస్టర్ నేరం వెలుగు చూసింది. అయితే కోర్టుకెక్కని, బైటపడని అన్యాయాలు ఎన్నో చర్చిల్లో జరుగుతున్నాయి. ప్రత్యేకించి మైనర్ బాలికలు బెదిరింపులకు భయపడి తమకు జరిగిన అన్యాయాన్ని బైటకు చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతూ జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారు.
పాస్టర్ కోటేశ్వరరావు ఉదంతం వల్ల ఒక కీలక విషయం ప్రధానంగా తెలిసొచ్చింది. అదేంటంటే చర్చిల్లో మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు. పద్ధెనిమిదేళ్ళ లోపు ఆడపిల్లలు, ప్రత్యేకించి గ్రామీణ నేపథ్యం ఉండి బలహీన వర్గాలకు చెందిన అమ్మాయిలు చర్చిలో పాస్టర్ బోధనలను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నారు, ఆయన ఏం చేసినా తమ మంచి కోసమే చేస్తాడని భావిస్తున్నారు. అలాంటి సమాజాల్లో పాస్టర్లు, ఇతర మతగురువులు తమ అనుయాయులపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఆ అమ్మాయిలు సైతం తమ మతగురువులపై పూర్తి నమ్మకం ఉంచుతున్నారు. అలాంటి అపరిమిత అధికారం సాధించే మతగురువులు, యథేచ్ఛగా తమ దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారు. పాస్టర్ కోటేశ్వరరావు నేరం నిరూపణ అయి శిక్ష పడడంతో అటువంటి వేధింపులకు గురవుతున్న బాలికలు, మహిళలు మరింతమంది బైటకు రావాలి. చర్చ్‌లలో తమపై జరుగుతున్న అత్యాచారాల గురించి నోరెత్తాలి. మతం మాటున జరుగుతున్న అత్యాచారాలను, ఘాతుకాలనూ బహిర్గతం చేయాలి.