వరద మిగిల్చిన విషాదం నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారు. తాజాగా ఏపీని ముంచెత్తిన వరదలకు 11 లక్షల మంది నష్టపోయారు. 2 లక్షల ఇళ్లు నీట మునిగాయి. దాదాపు 6 లక్షల ఎకరాల్లో పంట వరదపాలైంది. వరదల్లో మునిగిపోయిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం సాయం ప్రకటించింది. వరి పొలాలకు ఎకరాకు రూ.10వేలు సాయం చేయాలని నిర్ణయించింది. ఎరువులు వేస్తే పంట వచ్చేలా అవకాశం ఉన్న రైతులకు ఉచితంగా ఎరువులు అందించాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనాలు వేస్తోంది. పెనమలూరు, గన్నవరం, కంకిపాడు మండలాల్లో వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. 40 లంక గ్రామాల్లో పసుపు, కంద, అరటి తోటలు వరదకు కొట్టుకుపోయాయి. వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉద్యానపంటలకు అధికసాయం చేసేందుకు అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.6880 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు. ఇది మరింత పెరిగే అవకాశముందని రెవెన్యూ అధికారులు తెలిపారు.