కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. 70 ఏళ్ళు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 70 ఏళ్లు, ఆపై వయస్సు ఉన్నవారికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేయాలనే నిర్ణయం గొప్ప మానవతా దృక్పథంతో కూడుకున్నదన్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది లబ్ధి కలుగుతుందన్నారు.
లబ్ధిదారుల సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందే అవకాశం ఉంటుందన్నారు.
ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఉన్న కుటుంబాల్లో ఉన్న సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో రూ.5లక్షలు బీమా వర్తింపజేయనున్నారు. ఇతర బీమా పథకాల్లో చేరి ఉన్నవారు బీమా లేదా పీఎంజేఏవై ఎంచుకొనేందుకు వెసులుబాటు కల్పించారు.
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని కేంద్రప్రభుత్వం 2018 సెప్టెంబర్లో లాంఛనంగా ప్రారంభించింది. ఆసుపత్రిలో చేరినప్పుడు ఈ కార్డు ద్వారా రూ. 5లక్షల వరకు వైద్యసేవలు ఉచితంగా అందిస్తారు.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే ఉద్దేశంతో రూ.10,900 కోట్లతో ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకానికి కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 88,500 ఛార్జింగ్ స్టేషన్లకు కేంద్రం తోడ్పాటు అందించనుంది. అలాగే, 31,350 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ.12,461 కోట్ల ఖర్చు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.