రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే విజయవాడ వాసులకు వరద కష్టాలు వచ్చాయని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మరోసారి ఆరోపించారు. కరకట్టపై సీఎం చంద్రబాబు నివాసాన్ని రక్షించేందుకే బుడమేరు గేట్లు ఎత్తి 60 మంది చనిపోవడానికి కారణమయ్యారన్నారు.
ప్రకాశం బ్యారేజీలో ఇరుక్కుపోయిన బోట్లు టీడీపీకి చెందిన వారివే అన్నారు. చంద్రబాబు, లోకేశ్ తో బోటు ఓనర్ ఫొటోలు దిగలేదా అని ప్రశ్నించారు. టీడీపీ విజయోత్సవాల్లో సదరు బోట్ల ఓనర్ పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించారు.
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు తప్పుడు సంప్రదాయానికి నాంది పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్, పాలన గాలికొదిలేసి రెడ్బుక్పైనే బాబు దృష్టి పెట్టారని మండిపడ్డారు.
సూపర్ సిక్స్ హామీలు మోసమని తేలాయన్నారు. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో పాటు ఇంటింటికి సేవలను నిలిపేశారన్నారు. ఆసుపత్రుల్లో మందులు, నర్సుల కొరత ఉందన్నారు. మెడికల్ కాలేజీలను అమ్మేందుకు యజమానులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పాలనలో వైఫల్యం చెందినందున ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.