ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. రోడ్డు మార్గంలో తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలు, సహాయ చర్యలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పంట నష్టం కింద ఎకరాకు రూ.10 వేలు పరిహారం చెల్లించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
గతంలో బుడమేరుకు గండ్లు పడితే వైసీపీ ప్రభుత్వం పూడ్చలేదన్న చంద్రబాబు, తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చారని దుయ్యబట్టారు. మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు వద్ద 5 రోజులు ఉండి గండ్లు పూడ్చడంతోనే విజయవాడకు వరద తగ్గిందన్నారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద పడవలు వదిలింది వైసీపీకి చెందిన వారే నని అన్నారు. ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయడానికి వైసీపీ వాళ్లే ఉద్దేశపూర్వకంగానే వాటిని నదిలో వదిలిపెట్టారని మండిపడ్డారు. బోట్లపై వైసీపీ రంగు ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు. ఆ బోట్లను ఇసుక అక్రమ రవాణాకు ఉపయోగించే వారని విమర్శించారు.