పాకిస్తాన్‌లోని బలోచిస్తాన్ ప్రొవిన్స్‌లో విద్యావ్యవస్థ క్షీణించిపోతోంది. ఇటీవల అక్కడ మరో 542 పాఠశాలలను మూసివేసినట్లు విద్యాశాఖ తాజా నివేదిక వెల్లడించింది. ఆ ప్రొవిన్స్‌లో మూసివేసిన పాఠశాలలను మళ్ళీ తెరవడానికి 16వేల మంది ఉపాధ్యాయులు కావాలని ఆ నివేదిక స్పష్టం చేసింది.
బలోచిస్తాన్ ప్రొవిన్స్‌లోని 35 జిల్లాల్లో ఈ యేడాది మే నెల నాటికి 3,152 బడులు మూసివేసారు. ఇక సెప్టెంబర్ 2 నాటికి ఆ సంఖ్య 3,694కు పెరిగింది. అంతేకాదు, చదువుకునే విద్యార్ధుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. 2021 నాటికి బలోచిస్తాన్‌లో బడి మానేసిన పిల్లల సంఖ్య 12లక్షలుగా ఉండేది. అంటే బడి వయసు పిల్లల్లో 70శాతానికి పైగా పిల్లలు చదువుకోవడం లేదు. అలాగే 7వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉండేవి. ఈ మూడేళ్ళలో పరిస్థితి నానాటికీ దిగజారుతూనే ఉంది. బడుల మూసివేత, ఉపాధ్యాయుల కొరత క్రమంగా పెరుగుతూనే వచ్చాయి.
బలోచిస్తాన్‌లో విద్యావ్యవస్థ కుప్పకూలిపోయిందనే చెప్పవచ్చు. దానికి ప్రధాన కారణం నిధుల లేమి, వనరుల కొరత. బలోచ్ ప్రొవిన్స్ అంతటా పాఠశాలలు, కళాశాలల్లో శుభ్రమైన తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలే లేవు. ఆ ప్రొవిన్స్‌లో చాలా పాఠశాలలకు మౌలిక సదుపాయాలు లేవు. అంటే భవనాలు, కనీస సౌకర్యాలు, టీచింగ్ మెటీరియల్స్ లేవు. ఇంక గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి చెప్పనే అక్కర్లేదు.
పాకిస్తాన్‌లోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే బలోచిస్తాన్‌లో విద్యార్ధుల నమోదు, ప్రత్యేకించి విద్యార్ధినుల నమోదు చాలా తక్కువ. అమ్మాయిల చదువుకు అడ్డం పడుతున్న ప్రధాన కారణాలు సామాజిక-సాంస్కృతిక కారణాలు, భద్రత పట్ల ఆందోళన, ఆర్థిక ఇబ్బందులు మొదలైనవి.
ఆ సమస్యలకు తోడు, శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత విద్యాప్రమాణాల పతనానికి ప్రధాన కారణమని ప్రపంచ బ్యాంకు పరిశీలనలో తేలింది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం కూడా విద్యారంగాన్ని దెబ్బతీసాయి. పాకిస్తాన్‌లోని మిగతా ప్రొవిన్స్‌లతో పోలిస్తే బలోచిస్తాన్‌లో మొత్తంగా అక్షరాస్యత రేటు, పిల్లలకు చదువు అబ్బే స్థాయి చాలా తక్కువగా ఉన్నాయి. దానివల్ల బలోచ్ ప్రొవిన్స్ పిల్లలకు ఉన్నత విద్యా, ఉద్యోగ అవకాశాలు క్షీణించిపోతున్నాయి.