హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఇవాళ హిందూ సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. నగరంలోని సంజౌలీ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన మసీదు కారణంగా కొన్నాళ్ళుగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. హిందూ సంఘాల ఆందోళన పిలుపుతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు మోహరించాయి.
సంజౌలీలోని మసీదు చుట్టుపక్కలే కాకుండా ఆ ప్రాంతం అంతటా పోలీసు బలగాలను మోహరించారు. డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేసారు. ధాలీ సొరంగం దగ్గర రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసారు.
జిల్లా కమిషనర్ అనుపమ్ కాశ్యప్ సంజౌలీలో ఈ ఉదయం 7గంటల నుంచి అర్ధరాత్రి వరకూ పరిమిత కర్ఫ్యూ విధించారు. ముందుజాగ్రత్త చర్యగా నిన్న రాత్రి పోలీసులు ఆ ప్రాంతంలో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు.
‘‘సాధారణ జనజీవితానికి ఎలాంటి ఆటంకమూ ఉండదు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బడులు, మార్కెట్లు తెరిచే ఉంటాయి. ఎవరూ ఆందోళన చేయడానికి అనుమతి లేదు. లౌడ్స్పీకర్లు పెట్టడాన్ని నిషేధించాం’’ అని కమిషనర్ ఒక ప్రకటనలో తెలియజేసారు.
సంజౌలీ ప్రాంతంలోని మసీదు వివాదానికి చాలా చరిత్ర ఉంది. దేశానికి స్వతంత్రం రాకముందునుంచే ఆ వివాదం నడుస్తోంది. అప్పట్లో తాత్కాలిక నిర్మాణం మాత్రమే ఉండేది. 2010లో మసీదు శాశ్వత భవనం నిర్మాణం మొదలైంది. అప్పుడే స్థానిక ప్రజలు అక్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసారు. అప్పటినుంచీ ఆ వ్యవహారంపై మునిసిపల్ కార్పొరేషన్ కోర్టులో దావా నడుస్తూనే ఉంది. చట్టపరమైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ అక్కడ ఐదు అంతస్తుల భవనం నిర్మించారు. ఆ నిర్మాణం ఈ యేడాదే పూర్తయింది.
సిమ్లా మునిసిపల్ కార్పొరేషన్ అధికారిక రికార్డుల ప్రకారం అక్రమ నిర్మాణాన్ని అంతటితో నిలిపివేయాలంటూ కార్పొరేషన్ మొత్తం 35సార్లు ఆదేశాలు జారీ చేసింది. 2023లో మసీదులో భాగంగా నిర్మించిన టాయిలెట్లను మునిసిపల్ కార్పొరేషన్ కూల్చివేసింది. దాంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఆగస్టు చివరి వారంలో ఒక దాడి సంఘటన చోటు చేసుకుంది. దాంతో హిందూ సంఘాలు సెప్టెంబర్ 1న సంజౌలీలోనూ, సెప్టెంబర్ 5న చౌరా మౌదాన్లోనూ నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.
సెప్టెంబర్ 7న ఆ కేసుకు సంబంధించి మునిసిపల్ కమిషనర్ కోర్టులో 45వ విచారణ జరిగింది. మసీదు ఉన్న స్థలం తమదేనంటూ స్థానిక వక్ఫ్ బోర్డు కొన్ని పత్రాలు కోర్టుకు సమర్పించింది. తదుపరి విచారణ అక్టోబర్ 5కు వాయిదా పడింది. ఆలోగా వివాదాస్పద నిర్మాణం వద్ద తాజా పరిస్థితి గురించి నివేదిక సమర్పించమని జూనియర్ ఇంజనీర్‌ను కోర్టు ఆదేశించింది.
మసీదు ఇమామ్ షహజాద్ మసీదు ఉన్న ప్రదేశం తమదేనంటూ సమర్ధించుకున్నారు. ‘‘1947లో తాత్కాలికంగా నిర్మించిన రెండంతస్తుల భవనంలో మసీదు ఉండేది. అది తాత్కాలిక మసీదు కావడంతో ప్రజలు బైటే నమాజు చేసుకునేవారు. ఆ ఇబ్బందులను గుర్తించి ప్రజలే విరాళాలు సేకరించారు. అప్పుడు మసీదు నిర్మాణం మొదలైంది. ఆ భూమి వక్ఫ్ బోర్డుకు చెందినది. మసీదులోని రెండు అంతస్తుల గురించి వక్ఫ్ బోర్డు న్యాయపోరాటం చేస్తోంది. కోర్టు తీర్పును అందరమూ ఒప్పుకుంటాము’’ అని ఇమామ్ చెప్పుకొచ్చారు.
ఉద్రిక్తతలు పెరగకుండా, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖూ ప్రకటించారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేసుకోడంపై ఆంక్షలేమీ లేవు. మేం అన్ని మతాలనూ గౌరవిస్తాం, కానీ శాంతి భద్రతలను తమ చేతిలోకి తీసుకోడానికి ఎవరినీ అనుమతించం. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దు’’ అని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.