మణిపూర్‌లో కుకీ ఉగ్రవాదులు ఇటీవల చేరసిన డ్రోన్ దాడులకు విదేశీ శక్తులు సహాయం చేసాయని నిస్సందేహంగా తెలుస్తోంది. ఆ మేరకు మణిపూర్ పోలీసులు తగినన్ని సాక్ష్యాలు సేకరించారు. మెయితీ తెగకు చెందిన ప్రజలు, భద్రతా బలగాల మీద కుకీ ఉగ్రవాదులు చేసిన వరుస రాకెట్ దాడుల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందని నిరూపించగల సాక్ష్యాలను పోలీసులు సేకరించారు. ఈశాన్య భారతంలో మొదటిసారి జరిగిన డ్రోన్ దాడుల ఘటనలను ఇకపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ విచారించనుంది.
మణిపూర్‌లో జరిగిన డ్రోన్ దాడుల వెనుక విదేశీ శక్తుల హస్తముందని పోలీస్ (ఆపరేషన్స్) ఐజీ ఐకె ముయివా ధ్రువీకరించారు. దాంతో, ఆ దాడులపై విచారణ రాష్ట్రం పరిధి దాటిపోయింది. వాటిపై పూర్తిస్థాయి దర్యాప్తు కోసం ఎన్ఐఎ రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. మణిపూర్ పోలీసులు డ్రోన్ శకలాలు సహా పలు ఆధారాలు సేకరించారు. వాటిని విశ్లేషించి, అందులో వాడిన పదార్ధాలు ఏమిటో కనుగొనడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశోధనలు చేస్తోంది. విదేశీ జోక్యం ఆధారాల కారణంగా ఈ కేసు మరింత జటిలంగా మారిందని ఐజీ ముయివా వ్యాఖ్యానించారు. అందువల్ల ఈ కేసు విచారణను ఎన్ఐఎకు అప్పగించాలని ఆలోచిస్తున్నట్లు ఐజీ చెప్పారు.
మరోవైపు, రాష్ట్రంలో పరిస్థితుల గురించి ఆందోళన చేస్తున్న విద్యార్ధి సంఘాలకు చెందిన 11మంది ప్రతినిధులు మంగళవారం సాయంత్రం గవర్నర్‌తో చర్చలు జరిపేందుకు రాజ్‌భవన్‌కు వెళ్ళారు. మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కాపాడాలంటూ కొన్ని విద్యార్ధిసంఘాల ప్రతినిధులు రెండురోజులుగా ఇంఫాల్‌లో ఆందోళన చేపట్టారు. తమతో గవర్నర్ చర్చించాలంటూ మంగళవారం మధ్యాహ్నం వరకూ డెడ్‌లైన్ ఇచ్చారు. ఆ సందర్భంగా వారు చేపట్టిన నిరసన కార్యక్రమం హింసకు దారితీసింది. ఆందోళనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలో సుమారు 60మంది గాయపడ్డారు. వారిని రీజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – రిమ్స్ ఇంఫాల్‌కు తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు