ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఉదయం 6 గంటలకు నదిలో నీటిమట్టం 50.5అడుగులకు చేరింది. మరోవైపు శబరినది కూడా పోటెత్తింది. వరద 48 అడుగులకు చేరిన తర్వాత రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీచేస్తారు.
2022లో గోదావరికి భారీగా వరద వచ్చిన సమయంలో కరకట్ట ధ్వంసమైంది. దీంతో ప్రస్తుతం ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
ప్రభుత్వ రికార్డు ప్రకారం 1986లో గోదావరికి అత్యధిక వరద వచ్చింది. నీటిమట్టం 75.60 అడుగులకు చేరింది. అప్పుడు దాదాపు 27 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసింది. ఆ తర్వాత 2022 వరదల్లో ప్రవాహం 71.30 అడుగులుగా ఉంది. 21.78 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు వదిలారు.
అల్లూరి జిల్లాలోని విలీన మండలాలను శబరి, గోదావరి నదులు చుట్టుముట్టాయి. దీంతో ఏజెన్సీ వాసులు అల్లాడుతున్నారు. నాలుగు మండలాల్లో 37 ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.చింతూరు మండలంలో ఎన్ హెచ్-30, 326 లపైకి వరద ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్రా-తెలంగాణా-ఒడిశా-ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రవాణా స్తంభించింది.
ముకునూరు వద్ద సోకిలేరు వాగు రోడ్డుపై ప్రయాణిస్తోంది. కూనవరం మండలం, పోలిపాక వద్ద కూనవరం-భద్రాచలం ప్రధాన రహదారిపై గోదావరి వరద చేరింది. దీంతో ఆంధ్రా-తెలంగాణా రాష్ట్రాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటిమట్టం 14.2 అడుగులకు చేరగా 13 లక్షల 37వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో వదిలారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గౌతమి, వశిష్ట, వైనతేయ నదులకు కూడా వరద పోటు పెరిగింది. అమలాపురం కలెక్టరేట్ కార్యాలయంతో ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.
పోలవరం ప్రాజెక్టులోకి 10.31 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ఏలేరు, వంశధార, నాగావళి నదులు కూడా ఉగ్రరూపం దాల్చాయి.
ఏలేరు రిజర్వాయర్లోకి 19,813 క్యూసెక్కులు వరద చేరుతోంది. దీంతో స్పిల్ వే గేట్లు ఎత్తి 18,760 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 24,700 క్యూసెక్కులు , 27,283 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. నారాయణపురం ఆనకట్ట నుంచి 12,900 క్యూసెక్కుల నాగావళి జలాలు కడలిలో కలుస్తున్నాయి.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు