ఉత్తరప్రదేశ్‌లోని భదోహీ పట్టణంలో సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే జాహిద్ బేగ్ ఇంట్లో నిన్న సోమవారం ఒక దారుణం జరిగింది. ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసే 17ఏళ్ళ అమ్మాయి శవమై కనిపించింది. మేడ మీద గదిలో సీలింగ్‌ఫ్యాన్‌కు ఆ అమ్మాయి శవం వేలాడుతూ ఉంది. ఎమ్మెల్యే కుటుంబం మృతదేహం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సంఘటన అనుమానాస్పద పరిస్థితుల్లో జరిగిన ఆత్మహత్యలా కనిపిస్తోంది.
ఎమ్మెల్యే ఇంటినుంచి కాల్ రాగానే భదోహీ ఎస్పి మీనాక్షీ కాత్యాయన్ పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులతో అక్కడికి హుటాహుటిన వెళ్ళారు. సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ‘‘శవాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం పంపించాం. మృతురాలు ఎందుకు అలా చేసిందో తెలుసుకోడానికి దర్యాప్తు మొదలుపెట్టాం’’ అని ఎస్పి చెప్పారు.
ఎమ్మెల్యే జాహిద్ బేగ్ నివాసంలో పై అంతస్తులో ఉన్న ఒక గదిలోని సీలింగ్‌ఫ్యాన్‌కు మృతదేహం వేలాడుతూ కనిపించిందని పోలీస్ అధికారి అజయ్‌కుమార్ చౌహాన్ తెలియజేసారు. గది లోపలి నుంచి మూసివేయబడి ఉందని, అందువల్ల ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నామని చెప్పారు.
మరణించిన మైనర్ బాలిక ఎమ్మెల్యే ఇంట్లో చాలా యేళ్ళుగా పనిచేస్తోంది. ఆమె కుటుంబం మామ్దేవ్లోని కాన్షీరాం హౌసింగ్ లొకాలిటీలో నివసిస్తోంది. సోమవారం ఉదయం ఆ గది తలుపు ఎంతసేపటికీ తెరుచుకోకపోవడంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. చాలాసేపు ఎదురుచూసి తలుపు కొట్టిన తర్వాత లోపలికి తొంగిచూస్తే, బాలిక దేహం సీలింగ్‌ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆ వెంటనే వారు పోలీసులకు కాల్ చేసారు. కొద్దిసేపటికే ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపు బలవంతంగా తెరిచి మృతదేహాన్ని కిందకు దించారు. ఫోరెన్సిక్ టీమ్ గదిని పరిశీలించి, బాలిక మరణానికి దారితీసిన పరిస్థితులను నిరూపించే ఆధారాలు సేకరించారు.
ఎమ్మెల్యే జాహిద్ బేగ్ ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఆ అమ్మాయి పేరు నాజియా అని, ఆమె తమ ఇంట్లో ఎనిమిదేళ్ళుగా పనిచేస్తోందనీ చెప్పారు. మేడమీద ఒక స్టోర్‌రూమ్‌లో ఆమెకు నివాసం కల్పించినట్లు చెప్పారు. ఇక అధికారులు పోస్ట్‌మార్టమ్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. అది వచ్చిన తర్వాతనే బాలికది ఆత్మహత్యా కాదా అన్న విషయంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.