నెలకు రూ.80 లక్షలు చెల్లించి హెలికాప్టర్ అద్దెకు తీసుకోవాలని కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విమర్శల పాలవుతోంది. మొదట్లో హెలికాప్టర్‌ను మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టేందుకు, విపత్తు సమయాల్లో సహాయక చర్యల కోసం ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు దాన్ని ప్రధానంగా ముఖ్యమంత్రి పర్యటనల కోసం వాడుతున్నారు. దానిపైనే ఇప్పుడు వివాదం చెలరేగుతోంది.
కేరళలో భారత సైనికులు మావోయిస్టుల కార్యకలాపాలను ఇప్పుడు కాలి నడకన కనిపెడుతున్నారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగి పడిన బీభత్సం తర్వాత సహాయక చర్యల్లోనూ హెలికాప్టర్లు కానరాలేదు. వాటిని ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పర్యటనలకు మాత్రమే వాడుతున్నారు. దానివల్ల వ్యయం పెరిగిపోతోంది, అలాగే వాస్తవ వినియోగమూ తగ్గిపోతోంది.
ఢిల్లీకి చెందిన చిప్సాన్ ఏవియేషన్ కంపెనీ నుంచి కేరళ ప్రభుత్వం హెలికాప్టర్‌ను 2023 సెప్టెంబర్‌లో అద్దెకు తీసుకుంది. దాన్ని నెలకు 25 గంటలు తిప్పడానికి రూ.80 లక్షలు వ్యయం అవుతుంది. అంతకంటె అదనపు సమయం ఎగిరితే ప్రతీ గంటకూ రూ.90వేలు అదనంగా చెల్లించాలి.
కేరళ ప్రభుత్వం ఇప్పటివరకూ హెలికాప్టర్ అద్దెకు రూ.9.60 కోట్లు చెల్లించింది. చిప్సాన్ ఏవియేషన్‌తో ఈ కాంట్రాక్టు మూడేళ్ళ పాటు కుదుర్చుకున్నారు. అంటే మొత్తం వ్యయం రూ.28.80 కోట్లు అవుతుందన్న మాట. అంతకంటె తక్కువ ఖర్చుతో రాష్ట్రప్రభుత్వం సొంతగా హెలికాప్టర్‌ను కొనుక్కోగలిగి ఉండేది. హెలికాప్టర్ ఖరీదు రూ.5 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ ఉంటుంది. ఇప్పుడీ అనవసర వ్యయం కారణంగా పినరయి విజయన్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు నష్టం కలుగజేస్తోంది.
కేరళ సర్కారు 2020లో కూడా హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకుంది. కోవిడ్ సమయంలో ఛాపర్ అద్దెకు తీసుకోవడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఆ ఛాపర్‌ను పవన్‌హన్స్ కంపెనీ రూ.22.21కోట్ల ఖర్చుతో అద్దెకిచ్చింది. అయితే అప్పట్లో హెలికాప్టర్‌ను వాడిందే లేదు. అలా ఆ నగదు వృథా అయిపోయిందన్న విమర్శలు తలెత్తాయి. దాంతో పవన్హన్స్తో కాంట్రాక్టును ఏడాది తర్వాత నిలిపివేసారు. ఆ సంఘటన తర్వాత కూడా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే 2023లో మరోసారి ఇంకో హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకుంది.
హెలికాప్టర్ అద్దె కాంట్రాక్ట్ పేరు మీద కేరళ ప్రభుత్వం ఒక ప్రైవేటుకంపెనీకి కోట్లు ధారపోస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అది కూడా, రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ విలాసాన్ని నెత్తికెత్తుకోడం విమర్శలకు దారి తీసింది. ఈ హెలికాప్టర్ అద్దె కాంట్రాక్టు ఇచ్చే సమయానికి కేరళ సర్కారు, రాష్ట్రంలో వయోవృద్ధులకు ఇచ్చే సంక్షేమ పింఛన్ల కోసం ఋణం పొందడానికి సైతం ఇబ్బందులు పడుతోంది. కేరళ స్టేట్ ఆర్టిసి ఉద్యోగల వేతనాలు, పెన్షన్ల పరిస్థితి అనిశ్చితంగా ఉంది. ఇంక రాష్ట్రంలో అభివృద్ధిద ప్రాజెక్టులు, మౌలిక వసతుల మెరుగుదల కార్యక్రమాలకు నిధులు లేవు. అలాంటి సమయంలో హెలికాప్టర్ అద్దె కాంట్రాక్టు ఇచ్చారు.
ప్రస్తుతం, ప్రజలకు సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులు అందించడానికి ఏర్పాటు చేసిన కేరళ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్లో సరుకులు నిండుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ విభాగాలకు చెందిన కొత్త ప్రాజెక్టులన్నీ నిలిపివేసారు. ఇప్పటికే మొదలైన ప్రాజెక్టులు నిధులు లేక నత్తనడక నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులతో కేరళ ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారు. ఈ సమయంలో ఈ హెలికాప్టర్ అద్దె వ్యవహారం బైటపడడంతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు పెచ్చుమీరుతున్నాయి.