ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. అంతకంటె ముందు అంటే ప్రస్తుతం, కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ అమెరికాలోని టెక్సాస్‌లో పర్యటిస్తున్నారు. మోదీ పర్యటనకు కొద్దిగా ముందు రాహుల్ పర్యటన ఆసక్తి కలిగిస్తోంది.
టెక్సాస్ చేరిన వెంటనే రాహుల్ గాంధీ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ఇక్కడ నేను అర్ధవంతమైన చర్చల్లో, ప్రయోజనకరమైన సంభాషణల్లో పాల్గొనడం కోసం ఎదురు చూస్తున్నాను. అవి మన రెండు దేశాల మధ్య సంబంధాలనూ బలోపేతం చేస్తాయని భావిస్తున్నాను’’ అని రాసుకొచ్చారు.
రాహుల్ తన పర్యటనలో వాషింగ్టన్ డిసి, డాలస్ నగరాల్లో పలువురితో సమావేశమవుతారు. టెక్సాస్ విశ్వవిద్యాలయం విద్యార్ధులు, అధ్యాపకులతో భేటీ అవ్వాలని భావిస్తున్నారు. అలాగే స్థానికంగా ఉండే ప్రవాస భారతీయులను కలుస్తారు. పలువురు టెక్నోక్రాట్స్‌తో సమావేశమై తమ ఆలోచనలు పంచుకుంటారు., డాలస్‌లో కమ్యూనిటీ లీడర్స్‌తో కలిసి డిన్నర్ కూడా చేస్తారు.
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా, రాహుల్ అమెరికా పర్యటన షెడ్యూల్‌ను ధ్రువీకరించారు. ఆయన టెక్సాస్‌లోని ప్రవాస భారతీయులతో మాట్లాడుతూ తమ నాయకుడు రాహుల్ గాంధీకి ఉన్న దార్శనికత బీజేపీ భావజాలానికి విరుద్ధమైనదని, రాహుల్ ఒక ‘పప్పూ’ (వెర్రివాడు) కాదనీ చెప్పుకొచ్చారు.
‘‘బీజేపీ కోట్లు ఖర్చుపెట్టి ప్రచారం చేసే దానికంటె విభిన్నమైన దార్శనికత ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ. అతను అమాయకుడేమీ కాదు. రాహుల్ మంచి విద్యావంతుడు, బాగా చదువుకున్నవాడు, ఏ అంశం గురించి అయినా గాఢంగా ఆలోచించగలవాడు, మంచి వ్యూహకర్త. కొన్నిసార్లు అతన్ని అర్ధం చేసుకోవడం అంత సులువేం కాదు’’ అని శామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు.
రాహుల్ పర్యటన, ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనకు సుమారు రెండు వారాల ముందే జరుగుతోంది. మోదీ ఈ నెల 22న న్యూయార్క్‌లో పర్యటిస్తారు. లాంగ్ ఐలాండ్‌లోని నసావ్ వెటరన్స్ మెమోరియల్ కొలీజియం దగ్గర ప్రవాస భారతీయుల సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ కార్యక్రమానికి వేలాదిమంది ప్రవాస భారతీయులు హాజరవుతారని అంచనా. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పరచుకోడానికి, ఎన్ఆర్ఐలతో సమావేశం అవడానికీ అదొక గొప్ప అవకాశం.
ప్రధాని మోదీ దాని తర్వాత ఐక్యరాజ్యసమితి కార్యక్రమం ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో పాల్గొంటారు. ఆ కార్యక్రమం సెప్టెంబర్ 22, 23 తేదీల్లో న్యూయార్క్ నగరంలో జరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి చర్చిస్తారు. సుస్థిర అభివృద్ధి, శాంతి పరిరక్షణ, భద్రత వంటి కీలకమైన విషయాల గురించి భారతదేశపు వైఖరిని ప్రకటించడానికి మోదీకి అదో మంచి అవకాశం.
రాహుల్ పర్యటన దేనికి?
రాహుల్ పర్యటన గురించి అధికారికంగా చెబుతున్న సమాచారం ఏంటంటే ప్రవాస భారతీయులతో సమావేశం అవడం, అమెరికాకు చెందిన విద్యారంగ నిపుణులు, టెక్నోక్రాట్స్‌తో చర్చలు జరపడం ఆయన పర్యటన సారాంశం. అయితే మోదీ పర్యటనకు కొద్దిరోజుల ముందే రాహుల్ పర్యటన పలు ఊహాగానాలకు తావిస్తోంది. భారతదేశపు విదేశాంగ విధానం గురించి కాంగ్రెస్ దృష్టికోణాన్ని ప్రదర్శించడానికి, అంతర్జాతీయ భారతీయ సమాజంతో సమావేశం అవడానికీ ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నమే ఈ పర్యటన అని పరిశీలకులు భావిస్తున్నారు.
ఇద్దరు నాయకులూ అమెరికా పర్యటనలో భాగంగా అంతర్జాతీయ వేదికలపై భారత్ పాత్ర గురించి తమదైన శైలిలో చర్చిస్తారని, ప్రవాస భారతీయులతో సమావేశమై వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారనీ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సమావేశాలు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను ప్రభావితం చేస్తాయని అంచనా వేస్తున్నారు. అంతే కాక, మోదీ కంటె ముందు రాహుల్ హాజరీ ఈ ఉన్నత స్థాయి చర్చల వెనుక రాజకీయ కోణం ఉందా అన్న సందేహాలకు ఆస్కారం కల్పిస్తోంది.