విజయవాడలో మరోసారి కొండచరియలు విరిగిపడటంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మాచవరం పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
డేరంగుల వెంకటస్వామి వీధిలో ఓ నివాసం పక్కన కొండను ఆనుకుని ఉన్న చెట్టును తొలగించే పనుల్లో నలుగురు కూలీలు పాల్గొన్నారు. చెట్టుకొమ్మలు నరుకుతున్న క్రమంలో బాగా తడిచిన కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో విజ్జాడ రాము (55) మృతిచెందగా, కామయ్య, హుస్సేన్ గాయపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న మాచవరం పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులను ఆదేశించారు.
అల్లూరి జిల్లా జీకేవీధి మండల పరిధిలోని చట్రాయిపల్లిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గల్లంతయ్యారు.