మతిస్థిమితం లేని వ్యక్తిని విచక్షణా రహితంగా కొట్టడంతోపాటు, బైకుకు కట్టి ఈడ్చుకెళ్లి చంపిన ఘటన తెలంగాణలో వెలుగు చూసింది. మెదక్ జిల్లా శివ్వారం మండలం గోమారం గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. నెల రోజులుగా ఓ మతిస్థిమితం లేని వ్యక్తి బిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. ఇటీవల ఓ దొంగతనం జరగడంతో అది ఇతనే చేశాడనే అనుమానంతో గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి, మణికంఠగౌడ్ మద్యం సేవించి మతిస్థిమితం లేని వ్యక్తిపై దాడికి దిగారని పోలీసులు వెల్లడించారు.
మతిస్థిమితం లేని వ్యక్తిపై దాడి చేయడంతోపాటు, బైకుకు తాడుతో కట్టి గ్రామ శివారు వరకు ఈడ్చుకెళ్లారు. చనిపోయాడని నిర్థారించుకున్నాక వదిలేశారు. ఈ తతంగం మొత్తం సీసీకెమెరాలో రికార్డైంది. అయినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలుస్తోంది. ఓ రాజకీయ పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న మణికంఠగౌడ్ అరెస్టు కాకుండా, బడా నేతలు అడ్డుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
5వ తేదీన ఘటన జరిగినా 9వ తేదీ వరకు అరెస్టు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించామని పోలీసులు చెపుతున్నారు. కేసుకు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.